: అందరూ ఐకమత్యంగా ఉండాలన్నదే నా ఆకాంక్ష: హరికృష్ణ
అందరూ ఐకమత్యంగా ఉండాలన్నదే తన ఆకాంక్ష అని తెలుగుదేశం పార్టీ నేత హరికృష్ణ అన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు ఉదయం ఎన్టీఅర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, 'స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నా' అని లేఖలో పేర్కొన్నందువలనే తన రాజీనామాకు వెంటనే ఆమోదం లభించిందని అన్నారు. రాజీనామా లేఖలు స్పష్టంగా ఉంటే తప్పకుండా ఆమోదిస్తారని తెలిపారు. తన రాజీనామాపై వస్తున్న విమర్శలను పట్టించుకోనని, రాష్ట్ర ప్రజల కోసమే తాను రాజీనామా చేసినట్టు వెల్లడించారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో దాని కోసమే నాయకులు పని చేయాలని అన్నారు. సమ్మెలో పాల్గొన్న వారికి జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిష్పక్షపాతంగా పరిపాలిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. పుట్టిన రోజు వేడుకలకు తాను దూరంగా ఉంటున్నట్టు తెలిపారు.