: కాంగ్రెస్ ప్రభుత్వమే అల్లకల్లోలానికి కారణం: చంద్రబాబు
కాంగ్రెస్ పార్టీపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. హైదరాబాద్ లోని ఆయన నివాసం నుంచి మాట్లాడుతూ, కాంగ్రెస్ బాధ్యతా రాహిత్య పాలన వల్లే దేశం, రాష్ట్రంలో పాలన పడకేసిందన్నారు. కాంగ్రెస్ దగాకోరు విధానాలను తన బస్సు యాత్ర సందర్భంగా ప్రజల్లోకి తీసుకెళతానని ఆయన స్పష్టం చేశారు. విభజనపై ఏం చేయాలో కాంగ్రెస్ అధిష్ఠానానికి సూచించానని చెప్పిన బాబు, కాంగ్రెస్ వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం ప్రయత్నించిందని, అందుకే ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టిందని విమర్శించారు.
జరిగిన విషయాలన్నింటినీ ప్రజలముందుకు తీసుకెళతానని బాబు తెలిపారు. విభజన అంశాలపై నిజానిజాలను ప్రజలకు వివరిస్తానని, ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో వారే తేలుస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విభజన నిర్ణయం తరువాత ప్రజలంతా ఏకమై స్వచ్ఛందంగా ఇన్ని రోజులు రోడ్ల మీద ఉంటే కేంద్రం స్పందించదా? అని ప్రశ్నించారు. ఒక వైపు రాష్ట్రం అగ్నిగుండమైపోతుంటే బాధ్యతా రాహిత్య వ్యాఖ్యలు చేస్తారా? అని కాంగ్రెస్ పార్టీని నిలదీశారు. తన తొమ్మిదేళ్ల పాలనను, కాంగ్రెస్ పార్టీ 9 ఏళ్ల పాలనను ప్రజలకు వివరిస్తానని ఆయన అన్నారు.
రాష్ట్రంలోని ప్రజలకు సమన్యాయం ఎలా చేయొచ్చో కాంగ్రెస్ పార్టీకి తెలిపానని ఆయన చెప్పారు. తాజాగా ఏపీఎన్జీవోలు కాంగ్రెస్ పార్టీ కమిటీ అయిన ఆంటోనీ కమిటీకి టీడీపీ అభిప్రాయాలు చెప్పాలనడం సరికాదని బాబు సూచించారు. కేంద్రంలో ప్రధాని, ఇతర మంత్రులు సోనియా గాంధీ చేతిలో కీలుబొమ్మలుగా మారారని ఆయన విమర్శించారు. సోనియా చేతిలోనే అంతా ఉందని అంటున్నారని, అంటే ఆమె సమాంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారా? అని ప్రశ్నించారు. నిర్ణయం ఏదయినా ప్రజాభీష్టాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని బాబు స్పష్టం చేశారు.
రాష్ట్ర విభజన అనేది సున్నితమైన అంశమని, అలాంటి సమస్యను మరింత జటిలంగా మార్చారని, సున్నితమైన సమస్యను పరిష్కరించాల్సిన విధానాన్ని కేంద్రం అవలంబించలేదని ఆక్షేపించారు. విభజన అంశంలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్, వైఎస్సార్సీపీలతో కాంగ్రెస్ లాలూచీ పడిందన్నది నిజం కాదా? అని బాబు సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రాల్లో చిచ్చుపెట్టడమే ప్రజాస్వామ్యమా? అని ఆయన మండిపడ్డారు. ప్రజల్లోకి వెళ్లి వారి అభిప్రాయాలు తెలుసుకుని సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.