: టీడీపీ హయాంలో ఒక్క రోజు సమ్మెలు జరగలేదు: చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పాలనపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ పాలన దేశానికి ఓ శాపంలా పరిణమించిందని విమర్శించారు. హైదరాబాదులోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ పాలన పోతేనే దేశం బాగుపడుతుందని అన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్ అసమర్థత వల్లే దేశం అధోగతి పాలైందని ధ్వజమెత్తారు. టీడీపీ పాలించిన తొమ్మిదేళ్ల కాలంలో సమ్మెలు కానీ బంద్ లు కానీ జరగలేదని బాబు తెలిపారు. అలాంటిది ఇప్పుడు సమ్మెలేని రోజు లేదని ఆక్షేపించారు. ప్రజలంతా రోడ్లపైనే ఉన్నారని, శాంతి భద్రతల సమస్య తీవ్రంగా నెలకొందని బాబు మండిపడ్డారు.
సాక్షాత్తు ప్రధానే.. అవినీతికి ఆద్యుడైన వైఎస్ లేకపోవడం వల్లే రాష్ట్ర విభజన జరిగిందని అనడాన్ని తప్పుపట్టారు. తెలుగువారి గౌరవాన్ని ఎన్టీఆర్ చాటితే ఆత్మవిశ్వాసాన్ని తాము పెంచామని అన్నారు. అవకాశవాద రాజకీయాలకు పాల్పడడం వల్లే రాష్ట్ర విభజన జరిగిందని అన్నారు. తాను ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుంటానని ఆయన తెలిపారు. పాదయాత్రకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నానని, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్ని ప్రజలకు వివరిస్తానని చెప్పారు.
ఇక బొగ్గు కుంభకోణంలో జైలుకు వెళ్లాల్సివస్తుందన్న భయంతోనే ఫైళ్ళు మాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. ఏ కుంభకోణంపైనా ప్రధాని చర్యలు తీసుకునే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. అడ్డు అదుపు లేకుండా నిత్యావసరాల ధరలు పెంచి, ఆహార భద్రత అంటే ఏం ప్రయోజనం? అని ప్రశ్నించారు. మన్మోహన్ అసమర్థత వల్ల ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని ఆరోపించారు.
ఎన్ డీయే హయాంలో చేసిన సంస్కరణల వల్లే యూపీఏ ప్రభుత్వం తొలి పాలనలో లబ్ది పొందగలిగిందని బాబు తెలిపారు. గల్లంతైన ఫైళ్ళను వెతుకుతున్నారని పార్లమెంటులో ప్రధాని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎగుమతులు, దిగుమతులను నియంత్రిస్తూ ఆర్ధిక రంగాన్ని బలోపేతం చేయాల్సి ఉందన్నారు.
ఎన్నికలకు ఆర్నెల్ల ముందు ఆహార భద్రత బిల్లు పెట్టే అర్హత కాంగ్రెస్ కు ఎక్కడిదని బాబు ప్రశ్నించారు. ప్రభుత్వంలోని ఫైళ్ళు గల్లంతవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక సర్వనాశనమైన దేశఆర్ధిక వ్యవస్థను పునర్మించాల్సి ఉందన్నారు. ఈ ఆర్ధిక వ్యవస్థ భాగుపడుతుందన్న నమ్మకం ఎవరికీ లేదని బాబు అసహనం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ పతనం వల్ల రాబోయే రోజుల్లో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదని, దాని ఫలితంగా నిరుద్యోగం ప్రబలే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.