: మోడీయిజంపై సినిమా
నరేంద్ర మోడీ.. దార్శనికత ఉన్న రాజకీయవేత్తగా ఈ గుజరాత్ సీఎం ఎంతో ప్రాచుర్యం సాధించాడు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్త నెటిజన్లలో మోడీకున్న క్రేజే వేరు. ఖ్యాతి ఖండాంతరాలకు వ్యాపించడం వెనుక ఆయన కృషి, పట్టుదల అలాంటివి మరి. మాట సూటిగా బాణంలా దూసుకెళుతుంది. విమర్శ కత్తి కంటే పదునుగా చీరేస్తుంది. అయినా, ఆచితూచి వ్యవహరిస్తారు. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రే అయినా జాతీయ రాజకీయాల్లో ఆయన మాటకు అంత విలువ అందుకే మరి. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోదంటే.. సామాన్యుడిగా జీవనం ఆరంభించి సీఎంగా ఎదగడం వరకు ఆయన ప్రస్థానం ఇప్పుడు తెరకెక్కనుంది.
ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు ఎంత బడ్జెట్ అవుతుందో ఈ చిత్రానికి ఆ రీతిలోనే ఖర్చు చేస్తున్నారు నిర్మాతలు. రూ.40 కోట్ల బడ్జెట్ తో మితేశ్ పటేల్ అనే యువ దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమా కేవలం మోడీ జీవితం ఆధారంగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయమై మితేశ్ మాట్లాడుతూ, ఎవరినీ లక్ష్యంగా చేసుకుని ఈ సినిమా తీయడంలేదని, తమ ప్రాజెక్టుకు మోడీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిపాడు. కాగా, తారాగణంతో పాటు లోకేషన్లను ఎంపిక చేయాల్సి ఉంది.