: కాంగ్రెస్ ములాఖత్ లు బయటపడ్డాయి: సోమిరెడ్డి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు పన్నిన కుట్రలో భాగంగానే రాష్ట్రాన్ని ముక్కలు చేసిందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో టీఆర్ఎస్ తో పొత్తు కోసం, సీమాంధ్రలో వైఎస్సార్సీపీతో కలవడం కోసమే కాంగ్రెస్ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ప్రకటించిందని మండిపడ్డారు. టీడీపీ నేతలు నిరాహార దీక్షలు చేస్తే ఒక్క పూటలోనే అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన సోమిరెడ్డి, వైఎస్ జగన్ జైలులో దీక్ష చేస్తుంటే సహాయసహకారాలు అందిస్తున్నారని ఆరోపించారు. కేవలం టీడీపీని లక్ష్యంగా చేసుకుని రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దానికి సాక్ష్యం కాంగ్రెస్ పార్టీ మిగిలిన పార్టీలతో ములాఖత్ అయ్యేందుకు పడుతున్న తపనే అని అన్నారు.