: చాలామంది టిఫినీలు చేయడంలేదట!
కాఫీలు తాగారా... టిఫినీలు చేశారా... అంటూ ఒక సినిమాలోని కామెడీ సన్నివేశం గుర్తుందా... అయితే ఇక్కడ కామెడీ కాదులెండి... మనలో చాలామంది ఉదయం పూట టిఫినీలు చేయడం లేదట. ఇది ఉత్తినే చెబుతున్న మాటకాదు. చక్కగా ఈ విషయంపై ప్రత్యేకంగా నిర్వహించిన సర్వేలో తేలిన మాట. ఇప్పటికే మన దేశంలో చాలామందికి ఆహార కొరత ఉందని, అధిక సంఖ్యలో ప్రజలు సరైన ఆహార ధాన్యాలను కూడా కొనుగోలు చేయలేని ఆర్ధిక పరిస్థితిలో ఉన్నారనే వాదనలు వినవస్తున్న నేపధ్యంలో అసలు దేశంలోని మహానగరాల్లోని ప్రజల్లో నాలుగోవంతు మంది ఉదయం పూట తీసుకోవాల్సిన అల్పాహారానికి దూరమవుతున్నారని ఈ సర్వేలో తేలింది.
నిజానికి ఉదయం పూట అల్పాహారం కచ్చితంగా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రాత్రిపూట భోజనం చేసిన తర్వాత చాలా గంటల పాటు మనం ఎలాంటి ఆహారం తీసుకోము. దీంతో ఉదయం పూట ఆకలి వేస్తున్నా కూడా మనవారు సమయాభావం వల్లనో లేదా బరువు తగ్గించుకుందామనో ఇలా పలు కారణాలవల్ల ఉదయం పూట టిఫిన్ చేయకుండానే పనుల్లోకి దిగుతున్నారట. ఇలా చేయడం వల్ల బరువు తగ్గేమాట అటుంచితే దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మహానగరాల్లో నాలుగోవంతుమంది టిఫిన్ చేయడం లేదని కెల్లాగ్స్ ఇండియా సంస్థ వెల్లడించింది. నిర్మలానికేతన్ గృహవిజ్ఞాన కళాశాల ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై వంటి ప్రముఖ నగరాల్లో ఒక ప్రత్యేక సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో భాగంగా 2009 నుండి వివిధ దశల్లో 3,619 మంది ఆహారపు అలవాట్లను పరిశీలించిన తర్వాత ఈ పరిశోధకులు ఒక నిర్ణయానికి వచ్చారు.
వీరి పరిశోధనలో పాల్గొన్న వారిలో 27 శాతం మంది తాము ఉదయం పూట టిఫిన్ చేయడం లేదని తెలుపగా, 3 శాతం మంది మాత్రమే తాము ఉదయం పూట తప్పనిసరిగా టిఫిన్ తింటామని చెప్పారట. అయితే ఇలా టిఫిన్ చేయనివారిలో టీనేజ్ వయసువారు, మహిళలు 54 శాతంమంది ఉన్నారు. అల్పాహారం తీసుకునేవారిలో పౌష్టిక విలువలు చాలా తక్కువగా ఉంటున్నాయిని కెల్లాగ్స్ పరిశోధనా సంస్థ డైరెక్టర్ శివరామకృష్ణన్ తెలిపారు. ఢిల్లీవాసులు పరోటా, ముంబై, కోల్కతా వాసులు రొట్టె, పాలు, గుడ్డును, చెన్నైవాసులు ఇడ్లీ, దోసెలను అల్పాహారంలో చాలా ఇష్టంగా తింటారని తేలింది. ఈ నాలుగు నగరాల్లోను చెన్నైవాసులు పౌష్టిక విలువల విషయంలో కాస్త మంచి ఆహారం తీసుకుంటున్నారని పరిశోధకులు చెబుతున్నారు.