: మీ కంప్యూటర్‌కి పాఠాలు చెబుతారట
కంప్యూటర్లు సాధారణంగా పాఠాలు చెబుతుంటాయి. చాలా వరకూ కంప్యూటర్ల ద్వారా మనం పాఠాలు నేర్చుకుంటుంటాం. అయితే మన కంప్యూటరుకు పాఠాలు చెప్పడం ఏంటి? అని మీకు ఆశ్చర్యంగా ఉందా... అంటే మానవ భాషను కంప్యూటర్ సహజంగా నేర్చుకోవడానికిగాను దీనికి ప్రత్యేక పాఠాలను శాస్త్రవేత్తలు తయారుచేస్తున్నారు. ఈ పాఠాలతో కంప్యూటర్లు మానవ భాషను సహజంగానే నేర్చుకునేలా శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు.
టెక్సాస్ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు కంప్యూటరు మానవ భాషను సహజంగా నేర్చుకునేందుకు సహకరించే ఒక నూతన సాంకేతిక విధానాన్ని అభివృద్ధి చేశారు. సూపర్ కంప్యూటర్ను ఉపయోగించి ఈ మేరకు కొత్త విధానాన్ని కనిపెట్టినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకోసం కంప్యూటర్లకోసం సాధారణంగా వాడే కఠినమైన కోడ్‌తో కూడిన సంకేతాలు, డిక్షనరీలు కాకుండా సరికొత్త విధానాన్ని పాటించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇందులో భాగంగా పెద్ద మొత్తంలో పద సమూహాన్ని కంప్యూటర్లోకి చొప్పించినట్టు, పదాల మధ్య ప్రత్యేక బంధాన్ని ఏర్పరచేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఈ యూనివర్సిటీకి చెందిన పరిశోధకురాలు కెర్టిన్ ఎర్క్ చెబుతున్నారు.