: రూటు మార్చిన 'గూగుల్'
సెర్చి ఇంజిన్ దిగ్గజం గూగుల్ సరికొత్త ఆవిష్కరణల దిశగా పయనించేందుకు సదా మొగ్గు చూపుతుంటుంది. తాజాగా, డ్రైవర్లులేని ట్యాక్సీలకు రూపకల్పన చేస్తోంది. వీటికి రోబో ట్యాక్సీలని పేరు పెట్టేసిందీ టెక్నాలజీ జెయింట్. తమ నూతన ప్రాజెక్టు అమల్లోకి వస్తే చాలామంది కార్లు కొనే ప్రతిపాదనలను విరమించుకుంటారని గూగుల్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ హైబ్రిడ్ ట్యాక్సీల ద్వారా రోడ్డు ప్రమాదాలతో పాటు, పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుముఖం పడుతుందని ఈ సంస్థ చెబుతోంది. కాగా, ఈ సరికొత్త కార్ల తయారీ కోసం గూగుల్ ఇప్పటికే పలు ప్రముఖ కార్ల తయారీదారులతో చర్చలు జరిపింది.
తాజా ప్రాజెక్టులో భాగంగా ఆ సంస్థలు తమ కార్లలో గూగుల్ నూతనంగా అభివృద్ధి చేసిన సాఫ్ట్ వేర్ ను వినియోగించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్ వేర్ ను టయోటా ప్రయస్, లెక్జస్ ఆర్ఎక్ష్ మోడళ్ళలో ఇన్ స్టాల్ చేశారు. తాజా పరిజ్ఞానంలో భాగంగా కెమెరాలు, సెన్సర్లు, రాడార్లను కార్లకు అమర్చుతారు. ఇవి గూగుల్ ప్రత్యేక సాఫ్ట్ వేర్ తో అనుసంధానిస్తారు. తద్వారా కారు డ్రైవర్ లేకుండానే ముందుకెళ్ళడం సాధ్యమవుతుందని ఈ సెర్చింజన్ జెయింట్ వివరించింది.