: ఫొటో జర్నలిస్టు కేసు వాదించనున్న ప్రముఖ లాయర్
ముంబయి మహిళా ఫొటో జర్నలిస్టు అత్యాచారం కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ప్రముఖ లాయర్ ఉజ్వల్ నికమ్ వాదించనున్నారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తెలిపారు. ఈ మేరకు ఆయనను ప్రభుత్వం తరపున కోరినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ కేసుపై పుణెలోని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో త్వరితగతిన విచారణ జరుగుతుందన్నారు. అటు ఈ విషయాన్ని న్యాయవాది నికమ్ కూడా నిర్ధారించారు. కేసు వాదించాలని మహారాష్ట్ర సీఎం తనకు ఫోన్ చేసి కోరడంతో ఒప్పుకున్నట్లు చెప్పారు. కాగా, కేసుకు సంబంధించిన విషయాలు, బాధితురాలి పట్ల మీడియా సంయమనం పాటించాలని చవాన్ విజ్ఞప్తి చేశారు. ఉజ్వల్ నికమ్ పాక్ ఉగ్రవాది కసబ్ కేసుతో పాటు పలు కేసులను వాదించారు.