: పిచ్ పై మూత్ర విసర్జన చేసిన ఇంగ్లండ్ క్రికెటర్లు
కొద్ది వారాల క్రితం ఇంగ్లండ్ లో జరిగిన ఓ సంఘటన గుర్తుందా? స్పిన్నర్ మాంటీ పనేసర్ ఓ పబ్ లో చిత్తుగా తాగి, అక్కడే మూత్ర విసర్జన చేశాడు. అప్పట్లో అందరూ అతని చర్యను ఛీకొట్టారు. కానీ, ఇప్పుడు అతనే నయమనిపిస్తున్నాడు. సహచర ఇంగ్లిష్ క్రికెటర్లు చేసిన ఘనకార్యం గురించి తెలుసుకుంటే, పనేసర్ చేసింది పెద్దగా లెక్కలోకి రాకపోవచ్చు. ఆస్ట్రేలియాపై యాషెస్ సిరీస్ ను చేజిక్కించుకున్న ఆనందంలో ఇంగ్లండ్ జాతీయ జట్టు క్రికెటర్లు తామెక్కడున్నదీ మర్చిపోయారు. స్టేడియంలోని పిచ్ పైనే మూత్ర విసర్జన కానిచ్చారు. ఇంతకీ, ఈ పాడుపని చేసింది ఎవరో వర్ధమాన క్రికెటర్లు కాదు. అంతర్జాతీయ క్రికెట్ లో అపార అనుభవం సంపాదించుకున్న బ్యాటింగ్ స్టార్ కెవిన్ పీటర్సన్, ఏస్ బౌలర్ స్టూవర్ట్ బ్రాడ్!
ఆసీస్ తో యాషెస్ చివరిటెస్టు నిన్న ఓవల్లో డ్రాగా ముగిసింది. అయితే, ఆ సరికే సిరీస్ కైవసం చేసుకున్న ఇంగ్లండ్ జట్టు ఐదో టెస్టు ముగిసిన వెంటనే సంబరాలకు తెరదీసింది. షాంపేన్ ను వెల్లువెత్తించిన కుక్ అండ్ కో మైదానంలోనే అర్థరాత్రి వరకు గడిపింది. ఈ క్రమంలోనే కేపీ, బ్రాడ్ పిచ్ పై మూత్రం పోసినట్టు తెలుస్తోంది.