: పిల్లలే కానీ గ్రహశకలాలను కనుగొన్నారు


వారు స్కూలు పిల్లలే... అయితేనేం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారు. ఇప్పటి వరకూ అంతర్జాతీయ స్థాయిలో శాస్త్రవేత్తలు కనుగొనని రెండు గ్రహశకలాలను గుర్తించారు. వారు గుర్తించిన గ్రహశకలాలు కొత్తవని అంతర్జాతీయ శాస్త్ర సమాజం గుర్తించింది. దీంతో వారికి అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది.

ఢిల్లీలోని అమిటీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు చెందిన శౌర్య చాంబియాల్‌, గౌరవ్‌ పాటిబ్‌, గుర్గావ్‌లోని ర్యాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు చెందిన విద్యార్ధులు బాలచంద్ర రౌతు, ఆయుష్‌ గుప్తాలు రెండు వేర్వేరు బృందాల్లో ఉంటూ రెండు గ్రహశకలాలను కనుగొన్నారు. వీటిని అంతర్జాతీయ ఖగోళ సంఘం నిర్వహిస్తున్న అధికార మైనర్‌ బాడీ క్యాట్‌లాగ్‌లో చేర్చనుంది. వీరి ఆవిష్కారాన్ని గురించి స్వచ్ఛంద సంస్థ స్పేస్‌ సీఎండీ సచిన్‌ బాంబా మాట్లాడుతూ వీరు దేశానికి గర్వకారణమని అన్నారు. వీరు గుర్తించిన గ్రహశకలాలను కొత్తవిగా అంతర్జాతీయ శాస్త్ర సమాజం కూడా ధృవీకరించింది.

ఈ గ్రహశకలాలకు తాత్కాలికంగా 2013 ఎల్‌ఎస్‌28, 2013 పీఆర్‌ అని పేరు పెట్టారు. విద్యార్ధులు ఆకాశంలోని నిర్ధిష్ట ప్రాంతాలను వీక్షించడానికి ప్రత్యేక డేటాను ఉపయోగించారు. అమెరికాలోని టెలిస్కోపులు అందించిన చిత్రాలను పరిశీలించి, ఆస్ట్రోమెట్రికా అనే సంక్లిష్ట విధానం ద్వారా గ్రహశకలాలను గుర్తించారు. స్పేస్‌, అంతర్జాతీయ ఖగోళ అన్వేషణ సహకార సంస్థ సంయుక్తంగా చేపట్టిన అఖిల భారత గ్రహశకల అన్వేషణ కార్యక్రమంలో భాగంగా విద్యార్ధులు ఈ ఆవిష్కారాలను చేశారు.

  • Loading...

More Telugu News