: అత్యాచారం చేసి.. ఆమె టైతోనే ఉరి బిగించి హత్య
కామాంధులు రెచ్చిపోతున్నారు. దేశంలో అత్యాచారాలు పెచ్చు మీరిపోతున్నాయి. చట్టాలంటే భయం పోయిన నేరగాళ్లు దారుణాలకు పాల్పడుతున్నారు. మొన్న ముంబైలో జరిగిన ఘటన మరువక ముందే పూణేలో మరో దారుణం వెలుగు చూసింది. ఐదో తరగతి చదువుతున్న బాలికను బలవంతంగా పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారం, ఆపై హత్య చేసిన ఘటన వెలుగు చూసింది.
మహారాష్ట్రలోని పూణే కు వంద కిలోమీటర్ల దూరంలోని గలంద్ వాడి గ్రామంలో ఐదో తరగతి చదువుతున్న బాలిక ఒంటరిగా ఇంటికెళ్తుండడం గమనించిన యువకుడు ఆమెను బలవంతంగా పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తరువాత ఆ బాలిక వేసుకున్న యూనిఫాం కున్న టైతోనే ఉరి బిగించి హత్య చేశాడు. కుమార్తెను రోజూ తానే స్కూలుకు తీసుకెళ్లే వాడినని, వీలు కాకపోవడంతో నడిచి వస్తూ దారుణానికి బలైపోయిందని ఆమె తండ్రి ఆక్రోశం వెలిబుచ్చాడు. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉండే ఆ గ్రామంలో ఇలాంటి ఘటన జరగడం స్థానికులను కలచివేస్తోంది.