: స్నేహానికి నిర్వచనం.. పొలం తాకట్టు పెట్టి మిత్రుడ్ని చదివించారు
స్నేహానికి నిర్వచనంగా నిలిచే ఘటన ఒడిషాలో చోటు చేసుకుంది. రజీబా తిరియా అనే 23 ఏళ్ల యువకుడు ఒడిశాలోని మూరు మూల పల్లెలో జన్మించాడు. ఏడేళ్ల వయసులో అతని తండ్రి మరణించాడు. దీంతో ఆతని తల్లి రెక్కలు ముక్కలు చేసుకుని అతడ్ని డిగ్రీ వరకు చదివించింది. ఇంతలోనే ఆమె కూడా మరణించింది. దాంతో, ఇక ఉన్నత చదువులు చదవలేక సెల్ ఫోన్ రిపేర్ కంపెనీలో ఉద్యోగానికి చేరాడు. అతనికున్న తెలివితేటలు, చదువుపట్ల ఆసక్తి గమనించిన అతని మిత్రులు క్యాట్ పరీక్ష రాయమని పోత్సహించారు.
అతను క్యాట్ రాసి ఉత్తీర్ణుడయ్యాడు. దీంతో ఏకంగా ఆరు ఐఐఎం ల నుంచి ప్రవేశానికి పిలుపు కూడా వచ్చింది. కానీ ఫీజు కట్టేదెవరు? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. దీంతో అతని స్నేహితులే ముందుకు వచ్చారు. దీంతో రజీబా రోహ్ తక్ లోని ఐఐఎంలో చేరాడు. అతని మిత్రులు తమ పొలాలు తాకట్టుపెట్టి మరీ చదివించారు. ఇప్పుడు మంచి ఉద్యోగంలో కూడా చేరాడు. సమాజానికి తన వంతుగా ఏం చేయాలో రజీబా పక్కా ప్రణాళిక రచించుకున్నాడు.
తన మిత్రుల్లో కొందరు మెడిసిన్ చదువుతున్నారని, వారితో కలిసి మూరు మూల గ్రామాల్లో విద్య, వైద్య సేవలు అందించేందుకు పథకాలు రచించుకున్నామని తెలిపిన రజీబా, తన మిత్రులే తనకు సర్వమనీ, వారు లేకపోతే తాను లేనని, తన చుట్టూ అంతా మంచివారే ఉండడం తన అదృష్టమనీ అంటున్నాడు.