: లోక్ సభ నుంచి సీమాంధ్ర సభ్యుల సస్పెండ్
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, సభా కార్యక్రమాలను పదే పదే అడ్డుకుంటున్న 12 మంది సీమాంధ్ర సభ్యులను స్పీకర్ మీరాకుమార్ తన విశేషాధికారాలను ప్రయోగించి లోక్ సభ నుంచి సస్పెండ్ చేశారు. 374ఏ నిబంధన కింద సస్పెండ్ చేస్తున్నట్టు సభలో తెలిపారు. టీడీపీ నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి ఎనిమిది మంది సభ్యులు ఐదు రోజులు సభకు రావద్దని సభలో స్పీకర్ పేర్లు చదివారు. వెంటనే లోక్ సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. సస్పెండ్ అయిన వారిలో కాంగ్రెస్ నుంచి అనంత వెంకటరామిరెడ్డి, లగడపాటి రాజగోపాల్, హర్షకుమార్, కనుమూరి బాపిరాజు, మాగుంట శ్రీనివాసరెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్, సాయి ప్రతాప్, సబ్బంహరి.. టీడీపీ నుంచి మోదుగుల వేణుగోపాల్, శివ ప్రసాద్, నిమ్మల కిష్టప్ప, కొనకళ్ల సత్యనారాయణ ఉన్నారు.