: రాష్ట్రాన్ని విడగొట్టాలంటే 'ఆర్టికల్ 371(డి)'ని సవరించాలి
ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టాలంటే భారత రాజ్యాంగంలోని 'ఆర్టికల్ 371(డి)'ని సవరించకుండా ఏమి చేయలేమని లాయర్ పీవీ కృష్ణయ్య కొత్త వాదనను తెరపైకి తెచ్చరు. రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టులో నిన్న ఆయనే ఓ పిల్ ను దాఖలు చేశారు. ఇందులో 'ఆర్టికల్ 371(డి)'ని ఆయన లేవనెత్తారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఉన్న ఈ ఆర్టికల్ సమైక్యవాదుల వాదనకు మరింత బలం చేకూరుస్తుంది.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలంటే కేంద్ర ప్రభుత్వానికి సర్వ అధికారాలు ఉన్నాయి. అయితే, ఏపీ, జమ్మూ కాశ్మీర్ సహా కొన్ని రాష్ట్రాలకు రాజ్యాంగంలోని కొన్ని సెక్షన్లు ప్రత్యేక ప్రతిపత్తిని, విశేష అధికారాలను కల్పిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి 'ఆర్టికల్ 371(డి)' కూడా అలాంటిదే. మరే రాష్ట్రంలోనూ లేని విధంగా జోనల్ వ్యవస్థ ఉద్యోగ నియామకాలకు అవకాశం కల్పిస్తుంది.
రాజ్యాంగ బద్దంగా రాష్ట్రానికి విశేష అధికారాలు ఉన్నప్పుడు ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రాన్ని విభజించి మరొక రాష్ట్రం ఎలా ఏర్పాటు చేస్తారని పిటిషనర్ ప్రశ్నించారు. ఆయన వాదనను సీమాంధ్ర న్యాయవాదులు సమర్ధిస్తున్నారు. నదీ జలాలు, వనరులు, విద్య, ఉపాధి వంటి అంశాలపై శాస్త్రీయమైన అధ్యయనం జరగకుండా కేవలం రాజకీయ కారణాలతో చేసే విభజనను ఆపాల్సిందిగా పీవీ కృష్ణయ్య అత్యున్నత్య న్యాయస్థానాన్ని కోరారు. అయితే, ఆర్టికల్ 371(డి) సవరించడం ద్వారా విభజన ప్రక్రియను పూర్తి చేయవచ్చన్న వాదన ఉంది. ఆర్టికల్ 368 ప్రకారం ఈ ఆర్టికల్ ను సవరించవచ్చు. దీనికి మాత్రమే ఆ అధికారం ఉందంటున్నారు. కానీ, దానికి పార్లమెంటులో పూర్తిస్థాయి మెజారిటీ అవసరమంటున్నారు సీమాంధ్ర ప్రాంత న్యాయవాదులు.
తెలంగాణ న్యాయ వాదులు ఈ వాదనను కొట్టి పారేస్తున్నారు. దేశంలో పద్నాలుగు రాష్ట్రాల ఏర్పాటుకు అవసరంకాని నిబంధనలు, సవరణలను తెలంగాణ కోసమే కావాలనడం సమంజసం కాదంటున్నారు. ఈ వాదన కోర్టులో నిలబడదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఈ సుదీర్ఘ విచారణతో సోమవారం పిల్ పై కోర్టు ఏం చెబుతుందన్నది ఎదురుచూడాల్సిందే.