: ఇలాంటి పండ్లు తినవద్దు
కాలం కాని కాలంలో వచ్చే పండ్లను తినకుండా ఉంటేనే మేలని వైద్యులు చెబుతున్నారు. ఇటీవలే వచ్చిన రంజాన్ మాసం, దాని వెంటే వచ్చిన శ్రావణ మాసంలో పండ్లకు విపరీతమైన గిరాకీ ఉంటుంది. దీంతో ఎక్కువగా అమ్ముడు పోయేందుకు పండ్లను త్వరగా పక్వానికి వచ్చేలా చేయడానికి వ్యాపారులు రకరకాలైన కెమికల్స్ వాడుతుంటారు. దాని కారణంగా పండ్లు త్వరగా పక్వానికి వస్తుంటాయి. అయితే ఇలాంటి పండ్లను తినడం వల్ల ఆరోగ్యం మాట అటుంచితే అనారోగ్యం పాలు కావడం మాత్రం ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పుచ్చకాయ, కర్బూజ, పైనాపిల్, బొప్పాయి వంటి పండ్లను ఉపవాసం తర్వాత తీసుకోవడం వల్ల శరీరం కోల్పోయిన నీటిని, శక్తిని తిరిగి పుంజుకోవచ్చనే ఉద్దేశ్యంతో ఈ పండ్లను రంజాన్, శ్రావణ మాసాల్లో ఎక్కువగా కొంటుంటారు. అయితే అవి పండే కాలాల్లో వాటిని తినడం వల్ల మనం కోరుకునే ఆరోగ్యపరమైన లాభాలను పొందవచ్చు. అలా కాకుండా అన్ సీజన్లో ఇలాంటి పండ్లను మార్కెట్లో మనం కొనడం వల్ల లేని వ్యాధులను కొని తెచ్చుకున్నట్టే అవుతుందట. పండ్లు పండే కాలంలో కాకుండా సంవత్సరం మొత్తం మనకు మార్కెట్లో కనిపించే పండ్లు పండడానికి వాటికి కెమికల్స్ వేసి పండిస్తారు. ఇలాంటి పండ్లను తినడం వల్ల అనారోగ్యం పాలవడం ఖాయమని వైద్యులు చెబుతున్నారు. ఉపవాసాలు ఉండేవారు చక్కగా కనిపించే మంచి పండ్లను కాస్త ధర ఎక్కువైనా కొని తినడం మేలని చెబుతున్నారు. అలాగే అన్సీజన్లో కనిపించే పండ్లను తినకుండా ఉండడమే మేలని కూడా వైద్యులు సూచిస్తున్నారు. ఇలాంటి పండ్లను తినడం వల్ల వాంతులు, విరేచనాలుతోబాటు నోరు జిగటగా ఉండడం వంటి సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.