: జీఎస్ఎల్వీ డీ5 ప్రయోగం నేడే.. విజయం సాధిస్తుందా?


సమాచార సేవలను అందించే జీశాట్-14 ఉపగ్రహాన్ని తీసుకుని జీఎస్ఎల్వీ డీ5 రాకెట్ నేటి సాయంత్రం రోదసిలోకి వెళ్లనుంది. సాయంత్రం 4.50 గంటలకు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట, సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రంలో రెండో ల్యాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరుగుతుంది. నిన్న ఉదయమే ఇందుకు కౌంట్ డౌన్ మొదలైంది. ఇది నిర్విఘ్నంగా జరుగుతోంది.

ఈ ప్రయోగం ఇస్రో భవిష్యత్తును నిర్ధేశించనుంది. ఎందుకంటే ఈ శాటిలైట్ ప్రయోగానికి క్రయోజనిక్ ఇంజన్లను ఉపయోగిస్తున్నారు. మూడేళ్ల క్రితం క్రయోజనిక్ ఇంజన్లు ఫెయిలైన తర్వాత మళ్లీ వాటిని పరీక్షించడం ఇదే మొదటిసారి. క్రయోజనిక్ ఇంజన్ల సాయంతో ఐదు టన్నుల బరువు వరకూ ఉపగ్రహాలను రోదసిలోకి పంపడానికి వీలవుతుంది. ప్రస్తుతం ఇస్రో ఎక్కువగా ఆధారపడ్డ పీఎస్ఎల్వీ 1.5 టన్నుల బరువున్న ఉపగ్రహాలను మాత్రమే మోసుకెళ్లగలదు.

అయితే, నేడు ఇస్రో పంపిస్తున్న జీశాట్-14 బరువు 1.92 టన్నులు. దీంతో క్రయోజనిక్ ఇంజన్ల అవసరం తప్పనిసరి అయింది. అంతే కాదు, ఈ ఇంజన్లు విజయవంతం అయితే, ముందు ముందు దేశ, విదేశాలకు చెందిన బరువైన ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా ఇస్రో భారీ ఆదాయాన్ని ఆర్జించడానికి వీలవుతుంది. అందుకే నేటి ప్రయోగంపై ఇస్రో కొండంత ఆశలు పెట్టుకుంది.

  • Loading...

More Telugu News