: ప్రపంచానికి పొంచివున్న వేడి ముప్పు
ప్రపంచానికి వేడి గాలుల వల్ల ముప్పు సంభవించే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా ఇలా తీవ్రస్థాయిలో వేడి గాడ్పులు సంభవించే అవకాశముందని శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. భూతాపం పెరిగిపోతున్న కారణంగా వాతావరణంలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వీటిలో వేడిగాడ్పులు వీయడం కూడా ఒకటి. తీవ్రస్థాయిలో వీచే వేడి గాలుల వల్ల సమాజానికి తీవ్రమైన ముప్పు పొంచి ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు హ్చెరిస్తున్నారు.
పాట్స్‌డ్యామ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్ కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనంలో వాతావరణంలోని మార్పుల కారణంగా తీవ్రస్థాయిలో వేడి గాడ్పులు సంభవించే అవకాశం ఉందని తేలింది. వాతావరణంలోని మార్పుల కారణంగా 2012లో అమెరికాలో, 2009లో ఆష్ట్రేలియాలో సంభవించిన స్థాయిలో వేడి గాడ్పులు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాతావరణంలోకి విడుదలయ్యే కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణంలో సంబంధం లేకుండా శాస్త్రవేత్తలు ఈ అంచనాలను రూపొందించారు. ఈ పరిశోధనలో పాల్గొన్న డిమ్ కౌమౌ మాట్లాడుతూ 2040 నాటికి నెలవారీగా పెరిగే వేడి చాలా ఎక్కువ అవుతుందని గుర్తించామని, వేడి గాడ్పులు సమాజానికి, ఆవరణ వ్యవస్థకు హాని కలిగిస్తాయని, వడగాడ్పుల కారణంగా మరణాలు, అడవుల్లో మంటలు రావడానికి, వ్యవసాయ ఉత్పత్తుల నష్టానికి దారితీసే అవకాశముందని చెబుతున్నారు. వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్‌తో సంబంధం లేకుండా వీచే ఈ వేడిగాడ్పుల తరచుదనం పెరగడం వల్ల సమాజానికి తీవ్రమైన ముప్పు పొంచి ఉన్నట్టుగా భావించాలని కౌమౌ చెబుతున్నారు.