: బొత్స ఇంటిని ముట్టడించిన ఉపాధ్యాయ జేఏసీ
పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఇంటిని ముట్టడించేందుకు ఉపాధ్యాయ జేఏసీ నేతలు ప్రయత్నించారు. విజయనగరం జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం తారస్థాయికి చేరుకుంటోంది. జిల్లావ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ర్యాలీ చేస్తున్నారు. కాగా మండల కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు, మానవహారాలు, నిరసనలు, నినాదాలు మిన్నంటుతున్నాయి. ప్రజలంతా స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. జిల్లా కేంద్రంలో పీసీసీ చీఫ్ బొత్స ఇంటిని ముట్టడించేందుకు ఉపాధ్యాయ నేతలు ప్రయత్నించగా, వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఉద్యమకారులకు మధ్య తోపులాట జరిగింది. ఉద్యమకారుల నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.