: బాల్యంలో వేధింపులతో ఊబకాయం
బాల్యంలో వేధింపులకు గురైనవారికి పెద్దయ్యాక ఊబకాయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొందరు చిన్న తనంలోనే లైంగిక వేధింపులకు గురవుతుంటారు. ఇది వారిపై ప్రభావం చూపుతుందని, మిగిలిన వారితో పోలిస్తే ఇలాంటి వేధింపులను ఎదుర్కొన్నవారు పెద్దయ్యాక ఊబకాయ సమస్యను ఎదుర్కొనాల్సి వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
టోరంటోకి చెందిన కొందరు పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో బాల్యంలో వేధింపులకు గురైన బాలికల్లో పెద్దయ్యాక ఊబకాయం సమస్యను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలింది. బాల్యంలో ఎదురైన ప్రతికూల అనుభవాలను కొందరు మరిచిపోతారు. మరికొందరు పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఎక్కువగా ఒత్తిడికీ, కుంగుబాటుకూ గురవుతుంటారు. ఈ క్రమంలో ఎక్కువగా తినడం, లేదా తిండి మానేయడం వంటివి చేస్తుంటారు. ఫలితంగా దీర్ఘకాలంలో ఊబకాయానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీరు కొన్ని వేలమంది ఊబకాయం ఉన్న మహిళలతోను, మామూలు మహిళలతోను మాట్లాడి వారు వెల్లడించిన వివరాలను పరిశీలించి ఈ విషయాన్ని వెల్లడించారు. లైంగిక వేధింపులకు గురైన చిన్నారులు ఇంట్లో ఉన్నప్పుడు వారిముందు ఈ విషయం గురించి చర్చించకూడదు, వారికి తరచూ మానసిక నిపుణుల వద్ద కౌన్సిలింగ్ ఇప్పించాలని నిపుణులు సూచిస్తున్నారు.