: నీటి శుద్ధికి రసాయన ప్రక్రియలు అవసరంలేదు
నీటిని శుద్ధి చేయడానికి తీవ్రతరమైన రసాయన ప్రక్రియలు అవసరం లేదని, తాగునీటిలో ఉండే బ్యాక్టీరియానే చక్కగా ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాగునీటిలో ఉండే బ్యాక్టీరియాపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు నీటిలో ఆరోగ్యానికి హానికలిగించే బ్యాక్టీరియాను నియంత్రించడానికి నీటిలో ఉండే ఆరోగ్యానికి మేలు చేసే బ్యాక్టీరియానే అభివృద్ధి చేస్తే సరిపోతుందని చెబుతున్నారు.
షెఫీల్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో తాగునీటిలో ఉండే బ్యాక్టీరియా నీటిని శుద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని తేలింది. దీంతో నీటిని శుద్ధి చేయడానికి రసాయన ప్రక్రియలు అవసరం లేదని, వాటికి బదులుగా మరింత ఆధునిక, లక్షిత విధానాలు అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాగునీటిలో కనిపించే నాలుగు రకాల బ్యాక్టీరియా మిశ్రమాలపై దృష్టి సారించిన శాస్త్రవేత్తలు వాటిలో ఏ మిశ్రమం బయోఫిల్మ్ను ఏర్పరుస్తుందో గమనించారు.
నీటి పైపులోని లోపలి భాగాల్లో బ్యాక్టీరియాతో కూడిన పొరలను బయోఫిల్ములుగా పేర్కొంటారు. ఈ పొర వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఈకోలి, టీజియోనెల్లా వంటి హానికారక బ్యాక్టీరియాకు కూడా ఈ పొర రక్షిత స్థావరంగా ఉంటుంది. ఈ పొరలో హానికారక బ్యాక్టీరియా వృద్ధి ఎక్కువయితే పొర విచ్ఛిన్నమై నీటి ప్రవాహంలో కలుస్తుంది. ఫలితంగా నీరు రంగు, రుచి మారుతుంది. పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటే ప్రమాదకర బ్యాక్టీరియా తాగునీటిలోకి విడుదలవుతుంది. తమ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు బయోఫిల్ముల వృద్ధికి దోహదపడే పరిస్ధితులపై పరిశోధన సాగిస్తున్నారు. బయోఫిల్ముల వృద్ధిద్వారా నీటిలో హానికారక బ్యాక్టీరియాను నియంత్రించడానికి మరింత మెరుగైన పద్ధతులను కనుగొనవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.