: ఈ తాళంతో ఇక నిశ్చింతే


కారు నడిపే సమయంలో వేగం పెరిగితే ఆ విషయాన్ని మనకు గుర్తు చేసేలా ఒక కొత్తరకం తాళం చెవిని పరిశోధకులు రూపొందించారు. ఈ తాళం చెవి మన కారు వేగం పెరగగానే మనల్ని హెచ్చరిస్తుంది. ముఖ్యంగా కుర్రకారు కారు జోరుకు ఈ తాళం చెవి కళ్లెం వేస్తుందట. కుర్రాళ్లు కారులో వెళ్లే సమయంలో అపరిమితమైన వేగంతో కారును నడుపుతారు. దీంతో ఇంట్లోని పిల్లలు కారు తీసుకెళుతున్నారంటే ఇక తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఎప్పుడు ఎలా కారు నడిపి ప్రమాదానికి గురవుతారోనని తెగ ఆందోళన చెందడం తల్లిదండ్రుల వంతవుతుంది. ఇక ఇలాంటి ఆందోళనలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేసి ఎంచక్కా మీ పిల్లలకు కారు ఇచ్చేయండి అంటున్నారు ఈ తాళం చెవి తయారీదారులు.

ఫోర్డ్స్‌ సంస్థ ఒక సరికొత్త తాళం చెవిని ఆవిష్కరించింది. ఈ తాళం చెవి కుర్రాళ్ల చేతికి ఇచ్చిన తల్లిదండ్రులు వారు వేగంగా కారు నడుపుతారనే ఆందోళన లేకుండా నిశ్చింతగా ఉండవచ్చని చెబుతోంది. ఎందుకంటే ఈ తాళం ఉపయోగించి కారును నడిపేవారు సీటు బెల్టు పెట్టుకోకున్నా, 70 కిలోమీటర్లకన్నా వేగం పెంచినా కారునుండి పెద్ద పెట్టున శబ్దాలు వస్తాయి. ఈ శబ్దాలు గట్టిగా అరచి నానా యాగీ చేసేలా ఉంటాయి. అంతేకాదు కారులోని మ్యూజిక్‌ కుర్రాళ్ల వేగం పెంచేందుకు దోహదం చేస్తుంది కాబట్టి కారు వేగం పెరిగితే అందులోని మ్యూజిక్‌ సిస్టమ్‌ని కూడా ఈ తాళం ఆగిపోయేలా చేస్తుంది.

చిన్న పిల్లలు కొన్ని టీవీ ఛానల్స్‌ను చూడకుండా వాటిని టీవీలో రాకుండా తల్లిదండ్రులు చేస్తుంటారు. అదేవిథంగా ఈ తాళం చెవి కారు నిర్ణీత వేగం పెరిగిన వెంటనే హెచ్చరించేలా దీన్ని రూపొందించారు. ఈ తాళాలను ఇగ్నీషన్‌లో పెట్టగానే తాళంలోని సాఫ్ట్‌వేర్‌ కారు సిస్టమ్‌తో అనుసంధానమై అవసరమైనప్పుడు హెచ్చరికలు జారీచేస్తుందట. 'మై కీ' అనే ఈ తాళాలను ఫోర్డ్‌ 2014లో ప్రవేశపెట్టే మోడల్స్‌లో విరివిగా ఉంటాయని చెబుతున్నారు ఆ సంస్థవారు.

  • Loading...

More Telugu News