: యూట్యూబ్‌లో ఎర్రకోట ఉత్సవాలు
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. పతాకావిష్కరణ అనంతరం ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ పతాకావిష్కరణను, ప్రసంగాన్ని ప్రపంచవ్యాప్తంగా మన దేశ పౌరులంతా తిలకించేవిధంగా నెట్లో లైవ్ ప్రసారం చేయనున్నారు.
ఇప్పటి వరకూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం కావడం మాత్రమే చూశాం. అయితే తొలిసారిగా వీడియో షేరింగ్ సైట్ యూట్యూబ్ స్వాతంత్య్ర దినోత్సవ ఉత్సవాలను నెట్ జనులకు ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. గురువారం నాడు ఎర్రకోటపై ప్రధాని మన్మోహన్ సింగ్ చేసే పతాకావిష్కరణ, ప్రసంగం, అక్కడ జరిగే వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు దూరదర్శన్ ఛానల్, యూట్యూబ్ బుధవారం నాడు తెలిపాయి. ఈ ప్రసారం ఉదయం 6.25 గంటలకు మొదలవుతుందని, ఈ వేడుకలు, విశేషాలకు సంబంధించిన క్లిప్పింగులు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని, ప్రత్యక్ష ప్రసారం కోసం యూట్యూబ్‌తో ఒప్పందం చేసుకున్నట్టు దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ త్రిపురారి శరణ్ చెబుతున్నారు.