: 20 కేజీల బంగారంతో ఉడాయించబోయి.. పట్టుబడిన యువతి
అదృష్టం కలిసొచ్చిందనుకుంది.. పక్కాగా ప్లాన్ చేసింది.. అంతా ఓకే అనుకుంది, ఇక కథ సుఖాంతమైందనుకుంటున్న తరుణంలో కథ అడ్డం తిరిగింది. 20 కిలోల బంగారంతో ఉడాయించబోయి అడ్డంగా దొరికిపోయిందో అమ్మాయి. షార్జాలో నివసిస్తున్న ఓ భారతీయ కుటుంబంలోని తల్లి తమ దగ్గరున్న 20 కిలోల బంగారాన్ని భారత్ కు తెచ్చేందుకు అనుమతి పత్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఆ ఏర్పాట్లలో భాగంగా ఒకరోజు బంగారాన్ని కారులోని తన 20 ఏళ్ల కూతురితో ఉంచి, కస్టమ్స్ కార్యాలయంలోకి వెళ్లింది. ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆ యువతి, 20 కిలోల బంగారంతో పాటు ఉడాయించింది.
సెల్ కూడా స్విచ్ ఆఫ్ చేసేసింది. తనది కిడ్నాప్ గా భావిస్తారని, ఆ బంగారంతో తన పాకిస్థానీ స్నేహితుడితో సహా విదేశాలకు చెక్కేసి ఆనందంగా బతకొచ్చని భావించింది. ఇంతలో తన కుమార్తె కనిపించడం లేదని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు తీసుకున్న షార్జా పోలీసులు రంగంలోకి దిగడంతో ఆ యువతి కలలు కల్లలయ్యాయి. విమానాశ్రయంలో ప్రేమికులిద్దరూ పోలీసులకు దొరికిపోయారు.