: ప్రభుత్వం ఎందుకు పిలుస్తోందో తెలుసు.. సమ్మె విరమించేది లేదు: ఏపీఎన్జీవో
రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘంతో చర్చించినంత మాత్రాన ఎలాటి ప్రయోజనం లేదని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు పరుచూరి అశోక్ బాబు తెలిపారు. ఈ మధ్యాహ్నం ఏపీఎన్జీవో నేత, మంత్రి వర్గ ఉపసంఘంతో సమావేశం అవుతున్నారు. ఈ నేపథ్యంలో అశోక్ బాబు మాట్లాడుతూ.. సమ్మె విరమించుకోవాలనో, లేదా తాత్కాలికంగా ఆపాలనో కోరేందుకే తమను చర్చలకు పిలిచినట్టుగా భావిస్తున్నామన్నారు. అయితే, తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మెను విరమించుకునే ప్రసక్తేలేదని ఆయన స్పష్టం చేశారు.
చట్టబద్ధత లేని ఉపసంఘంతో భేటీ వలన ఎలాంటి ప్రయోజనం లేదని తాము భావిస్తున్నట్టు తెలిపారు. అలాగే ఈ నెల 16న అన్ని ఉద్యోగ సంఘాలతో కీలక భేటీ నిర్వహించబోతున్నామని తెలిపారు. ఆ తరువాత ఆంటోనీ కమిటీని కలుస్తామని చెప్పారు. రాష్ట్ర విభజనపై నేరుగా ప్రభుత్వంతోనే తేల్చుకుంటామన్నారు. దాదాపు నాలుగున్నర లక్షల మందికి పైగా ఉద్యోగులు ఇప్పటికే సమ్మెలో ఉండగా, మరికొన్ని శాఖల ఉద్యోగులూ సమ్మెకు దిగుతున్నట్టు ఆయన తెలిపారు.