: ఈ 'ఐన్‌స్టీన్‌' జబ్బును చెబుతుందట!


కంగారుపడకండి ... ఇక్కడ ఐన్‌స్టీన్‌ అంటే మన శాస్త్రవేత్త కాదు... అది ఒక పరీక్ష పేరు. అయితే ఈ పరీక్ష ఏ జబ్బును గురించి చెబుతుందంటారా... మతిమరుపు జబ్బును గురించి. అవునండీ... వయసు మీరిన తర్వాత మనకు వచ్చే మతిమరుపు (డిమెన్షియా) జబ్బును గురించి ముందుగానే గుర్తించడానికి ఈ పరీక్షను ఉపయోగిస్తే తెలుస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

షికాగోలోని నార్త్‌వెస్ట్ యూనివర్సిటీ ఫీన్‌బెర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ కు చెందిన కొందరు పరిశోధకులు ఒక పరీక్షను రూపొందించారు. ఈ పరీక్షపేరు 'ఐన్‌స్టీన్‌'. ఈ చిన్న పరీక్ష ద్వారా వృద్ధాప్యంలో రాబోయే మతిమరుపును గురించి ముందుగానే గుర్తించడానికి వీలవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. 40 నుండి 65 ఏళ్ల వయసులో ఉన్న వారికి ఈ పరీక్షను నిర్వహించడం ద్వారా డిమెన్షియా వ్యాధిని గుర్తించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరీక్షలో భాగంగా పరీక్షలో పాల్గొనేవారికి ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, బరాక్‌ ఒబామా, బిల్‌గేట్స్‌, ఓప్రా విన్‌ఫ్రే, ప్రిన్సెస్‌ డయానా, జన్‌ ఎఫ్‌ కెన్నడీ, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ వంటి 20మంది ప్రముఖుల బ్లాక్‌&వైట్‌ చిత్రాలను ఇచ్చి వారిని గుర్తించమని చెప్పారు. 62 ఏళ్ల వయసులో ఉన్నవారిపై ఈ పరీక్షను నిర్వహించి అధ్యయనం చేశారు. మతిమరుపు జబ్బున్న వారు ఈ చిత్రాల్లో ఉన్నవారి పేర్లను ఎంతమంది గుర్తుపడతారు, గుర్తుపట్టకపోతే ఆ వ్యక్తులకు సంబంధించి వారికి ఏం తెలుసో రాయమని చెప్పి పరిశీలించినట్టు టామర్‌ జెఫెన్‌ అనే పరిశోధకుడు తెలిపారు. చిత్రాల్లోని వ్యక్తుల పేర్లను గుర్తించడంలో ఇబ్బందిపడ్డవారు ఎడమ టెంపోరల్‌ లోబ్‌లోని మెదడు కణజాలం కోల్పోయినట్లు, ముఖాలను గుర్తించడంలో ఇబ్బందిపడ్డవారిలో ఈ మెదడు కణజాలం రెండువైపులా కోల్పోయినట్లు ఎంఆర్‌ఐ స్కాన్‌లో గుర్తించామని, దీని ఆధారంగా ముందగానే మతిమరుపు జబ్బును గురించి కనుక్కోవచ్చని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News