: దక్షిణ మధ్య రైల్వేల నిర్వహణ భయంకరం: కాగ్ అక్షింతలు
నిర్వహణ తీరుతెన్నులు అధ్వానంగా ఉన్నాయంటూ దక్షిణ మధ్య రైల్వేపై కాగ్ అక్షింతలు వేసింది. తాజాగా దక్షిణ మధ్య రైల్వేల్లో సదుపాయాల కల్పనపై కాగ్ జరిపిన తనిఖీల్లో దారుణమైన వాస్తవాలు వెలుగు చూశాయి. 17 రైల్వే జోన్లలో తనిఖీలు జరుపగా.. దక్షిణ మధ్య రైల్వేలో కంపార్ట్ మెంట్ల నిర్వహణ, ప్రయాణీకులకు సదుపాయాల కల్పన దారుణంగా ఉన్నాయని అభిప్రాయపడింది. విలాసవంతమైన దురంతో రైలులో ఎలుకలు, బొద్దింకలు ఆవాసముంటున్నాయని కాగ్ స్పష్టం చేసింది. వీటి నివారణ కోసం వాడుతున్న రసాయనాలు కూడా అత్యంత నాసిరకంగా ఉన్నాయని అభిప్రాయపడింది.
ప్యాంట్రీ కార్లలోని మరుగుదొడ్లలో నిల్వ ఉంచిన ఆహారపదార్థాలే ప్రయాణీకులకు సరఫరా చేస్తున్నారని కాగ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏసీ కంపార్ట్ మెంట్లలో ఇచ్చే దుప్పట్లు, దిండ్లు కూడా అత్యంత దారుణంగా ఉన్నాయని స్పష్టం చేసింది. విజయవాడ, కాచిగూడ, గుంటూరు, గుంతకల్లు, కర్నూలు, మచిలీపట్నం, డోర్నకల్, మిర్యాలగూడ, అక్కన్నపేట, హైటెక్ సిటీ రైల్వేస్టేషన్లలో కాగ్ పరిశీలన జరిపింది.