: బెడిసికొట్టిన ఫేస్ బుక్ పెళ్ళి
సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ తో లాభాలతో పాటు అనర్థాలూ అనుభవంలోకి వస్తున్నాయి. తాజాగా, ఓ యువకుడు ఫేస్ బుక్ లో పరిచయమైన స్త్రీని పెళ్ళి చేసుకుని ఆనక కంగుతిన్నాడు. అప్పటికే ఆమెకు పెళ్ళయి ఇద్దరు పిల్లలుండడమే అందుకు కారణం. వివరాల్లోకెళితే.. పశ్చిమగోదావరి జిల్లా చిగురుమామిడి మండలం లంబాడిపల్లికి చెందిన దాసరి కరుణాకర్ కు తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన అక్షరశ్రీతో ఫేస్ బుక్ పరిచయం ఏర్పడింది. కొద్దికాలంలోనే చాటింగ్ ద్వారా ఇద్దరి మనసులు కలిశాయి. ఇక తనువులూ కలిపేసుకునేందుకని పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
అనుకున్నట్టుగానే ఇద్దరూ ఓ గుళ్ళో వివాహం చేసుకుని, కొత్త కాపురం పెట్టేందుకు ఉద్యుక్తులవుతున్నారు. ఇంతలో పిడుగుపాటులా సుబ్బారెడ్డి అనే వ్యక్తి వచ్చి అక్షరశ్రీ తన భార్య అని చెప్పి ఆమెను తీసుకెళ్ళాడు. ఆమెకు అప్పటికే పిల్లలున్నారని కూడా చెప్పాడు. దీంతో, నోరు వెళ్ళబెట్టడం కరుణాకర్ వంతైంది. కాగా, అక్షరశ్రీ పేరిట రెండున్నర కోట్ల విలువైన ఆస్తులున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే, సుబ్బారెడ్డి కుటుంబీకులు అక్షరశ్రీ కనిపించడంలేదని కేసు పెట్టడంతో పోలీసులు కరుణాకర్ ను అదుపులోకి తీసుకున్నారు.