: రెండో ఎస్సార్సీకి టీఆర్ఎస్ అంగీకరించింది: కేవీపీ
తెలంగాణ విషయమై రెండో ఎస్సార్సీ కోసం 2004లో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య ఒప్పందం కుదిరిందని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో పరిణామాలపై రాజ్యసభలో జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడారు. తొలుత 2001లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రెండో ఎస్సార్సీ వేయాలని నిర్ణయం తీసుకుందని చెప్పారు. అంతకుముందు, ఎన్డీయే ప్రభుత్వం విదర్భ ఏర్పాటు సాధ్యం కాదని ప్రకటించిందని కేవీపీ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే రెండో ఎస్సార్సీకి సీడబ్ల్యూసీ తీర్మానించిందని వెల్లడించారు.
ఇక 2009లో రెండో పర్యాయం రాష్ట్రంలో విజయం సాధించిన తర్వాత వైఎస్.. తెలంగాణపై యూపీఏ భాగస్వాములతో చర్చించాలన్నారని తెలిపారు. ఆ వెంటనే రోశయ్య కమిటీ వేశారని చెప్పారు. ఈ సందర్భంగా కేవీపీ.. రోశయ్య కమిటీ పరిశీలించిన అంశాలను చదివి వినిపించారు. వైఎస్ చేసిన ప్రతిపాదన ఆధారంగానే రోశయ్య కమిటీ ఏర్పాటు చేశారని వివరించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే వైఎస్ వ్యవహరించారని, ఆయన ప్రాంతీయవాదాన్ని ప్రోత్సహించారనడం సరికాదని కేవీపీ చెప్పుకొచ్చారు.