: ఆంటోనీ కమిటీ కాదు, సైమన్ కమిషన్: ఏపీఎన్జీవోలు


రాష్ట్రానికి రానున్నది ఆంటోనీ కమిటీ కాదని బ్రిటిష్ పాలన నాటి సైమన్ కమిషన్ అని ఉద్యోగ సంఘాలు విమర్శించాయి. విభజనకు నిర్ణయం ఎలా తీసుకున్నారో, ఎవరెవరిని సంప్రదించారో, శ్రీకృష్ణ కమిటీ సిఫారసులు ఏం చేశారో తెలపాలని వారు డిమాండ్ చేశారు. 'స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచీ దగా పడుతూ వస్తున్నాం... ఇక సహించేది లేదు' అని సీమాంధ్ర ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతికి నోటీసిచ్చిన సందర్భంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. సెంట్రల్ గవర్నమెంటు కార్యాలయాలన్నీ, రాజధాని అంటూ ఇక్కడే నెలకొల్పి ఇప్పుడు ఎలా వెళ్లి పొమ్మంటారని మండిపడ్డారు.

హైదరాబాదులో నిర్మితమవుతున్న మెట్రో రైలు కానీ, ఔటర్ రింగ్ రోడ్డు కానీ తెలంగాణ వారి డబ్బుతోనే నిర్మితం కాలేదని తెలిపారు. దేశానికే తలమానికంగా నిలిచే అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రాజెక్టులన్నీ 60శాతం సీమాంధ్రుల నిధులతోనే నిర్మితమయ్యాయన్న వాస్తవాన్ని విస్మరించవద్దని తెలిపారు. హైదరాబాదులో వచ్చే ఆదాయం అంతా హైదరాబాదు నగరానికే చెందదన్న విషయాన్ని గుర్తించాలని కోరారు.

సముద్ర తీర ప్రాంతమే గాకుండా, వర్షాలకు మునిగిపోయే, భూకంప తీవ్రతకు గురయ్యే ప్రాంతాలన్నీ సీమాంధ్రలో ఉంటే.. సునామీ హెచ్చరికల కేంద్రం, భూకంప పరిశోధన కేంద్రం, తుపాను హెచ్చరికల కేంద్రాలను హైదరాబాదులో ఎందుకు నిర్మించారని ప్రశ్నించారు. గాంధీల కుటుంబ వారసులుగా దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న సోనియా గాంధీ తదితరులకు.. నెహ్రూ, ఇందిరలు ఎందుకు సమైక్యమన్నారో, విభజనను ఎందుకు వ్యతిరేకించారో తెలుసుకోవాలన్ని ఇంగిత జ్ఞానం లేదా? అని ఎద్దేవా చేశారు.

కలిసుండడంలో ఉన్న ఆనందం ఇటలీ నుంచి వచ్చిన సోనియాగాంధీకి ఎలా తెలుస్తుంది? అని ప్రశ్నించారు. సీమాంధ్ర రాజకీయ నాయకులు నాటకాలాడుతున్నారని, తమ ఘర్షణను ఎవరూ అపార్థం చేసుకోవద్దని, తాము తమ ప్రాంత ప్రజల ప్రయోజనం కోసమే ఉద్యమబాటపడుతున్నామని స్పష్టం చేశారు. రైతులు, విద్యార్ధులు, ఉద్యోగులు, వర్తకులు అందరూ విభజన వల్ల నష్టపోతారని వారు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News