: ఈ బూట్లు భలే ఉన్నాయే!
మార్కెట్లోకి కొత్తగా వచ్చే వస్తువులన్నీ కూడా మరింత ఆకర్షణీయంగానే ఉంటాయి. ఒక్కోసారి కొన్ని వస్తువులు పలు రకాలుగా ఉపయోగపడుతుంటాయి. అయితే కాలికి వాడే బూట్లు ఎన్నిరకాలుగా ఉపయోగపతాయి...? కాలికి మాత్రమే వేసుకోగలం కదా... అలాకాకుండా కాలి బూట్లతో చక్కగా టెంట్ వేసుకోవచ్చు అంటే... ఇలాంటివి అందరినీ బాగా ఆకర్షిస్తాయికదా...! అచ్చు అలాంటి షూనే ఒక కంపెనీ తయారు చేసింది. ఈ బూట్లు వేసుకుని ఎక్కడికైనా వెళ్లినపుడు మనం అక్కడ కాసేపు రెస్ట్ తీసుకోవాలనుకుంటే ఎంచక్కా మన షూతో మనం టెంటు తయారు చేసేసుకుని అందులో విశ్రాంతి తీసుకోవచ్చని తయారీదారులు చెబుతున్నారు.
వినూత్న వస్తువుల ఉత్పత్తులకు రూపకల్పన చేసే సిబ్లింగ్ కంపెనీవారు ఆష్ట్రేలియాకు చెందిన గోర్మన్ అనే పాదరక్షల కంపెనీకోసం ఒక కొత్తరకం టెంటుతో కూడిన బూట్లను డిజైన్ చేశారు. ఈ కొత్తరకం బూట్లకు 'వాకింగ్ షెల్టర్' అనే పేరు పెట్టారు. ఈ బూట్లను సుదూర ప్రాంతాలకు ప్రయాణించే పర్యాటకులకు, పర్వతారోహకులకు ఉపయోగపడే విధంగా కంపెనీవారు తయారు చేశారు. ఈ బూట్లు ధరిస్తే ఇక ప్రత్యేకంగా టెంటును మోసుకుపోవాల్సిన పనిలేదు. బూట్లనుండే టెంటును తయారు చేసుకొని మనకు అనువైన చోట విశ్రాంతి తీసుకోవచ్చని చెబుతున్నారు. విపత్తులు సంభవించినపుడు ఇలాంటి బూట్లు చక్కగా ఉపయోపడతాయని సిబ్లింగ్ కంపెనీ వారు చెబుతున్నారు.