: నేరాలనూ ఫేస్ బుక్ లో ఎక్కించేస్తున్నారు..
ఫేస్ బుక్.. కోట్లాది మందికి సోషల్ వారధి. సరదా కబుర్లు, కాలక్షేపాలు, విలువైన సమాచారం ఎన్నింటికో ఇది ఒక వేదికగా నిలుస్తోంది. కానీ, చేసిన పిచ్చి పనులు, ఆఖరుకు నేరాలను కూడా కొందరు ఫేస్ బుక్ లో చెప్పేస్తున్నారు. వాటి తాలూకూ ఫోటోలను కూడా ప్రదర్శిస్తున్నారు. 31 ఏళ్ల అమెరికా వ్యక్తి డెరెక్ మెడీనా తన భార్యను హత్యచేసి రక్తపు మడుగులో పడి ఉన్న ఆమె మృతదేహాన్ని ఫొటోలు తీసి, ఏదో ఘనకార్యం చేసినట్లుగా వాటిని ఫేస్ బుక్ లో అందరితో పంచుకున్నాడు.
'భార్యను చంపినందుకు నేను జైలుకు వెళ్లొచ్చు, లేదా ఉరిశిక్షకు గురి కావచ్చు. లవ్ యూ గైస్, మిమ్మల్ని మిస్ అవుతున్నాను, టేక్ కేర్ ఫేస్ బుక్ పీపుల్. నన్ను వార్తల్లో చూస్తారు. నా భార్య నన్ను కొట్టింది. ఇక నేను తనతో ఉండలేను. అందుకే ఇలా చేశా. అర్థం చేసుకుంటారని భావిస్తున్నా' అంటూ పోస్ట్ చేశాడు. ఇది చూసి మెడీనా ఇంటికి వెళ్లిన పోలీసులకు అతడి భార్య మృతదేహం కనిపించింది. చిత్రమేమిటంటే మెడీనా ఒక నటుడు, రచయిత. 'హౌ ఐ సేవ్డ్ సమ్ వన్స్ లైఫ్ అండ్ మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్ త్రూ కమ్యూనికేషన్' అనే పుస్తకం రాశాడు. చివరికి అతడే ఫ్యామిలీ ప్రాబ్లంతో భార్యను హతమార్చాడు.