: ఆరోగ్య పరిరక్షణకో పరీక్ష
ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం ఉంటే సంపద సృష్టించుకోవచ్చు. కానీ, సంపద ఉన్నంత మాత్రాన కోల్పోయిన ఆరోగ్యాన్ని మాత్రం తెచ్చుకోవడం సాధ్యం కాని పని. అందుకే వయసుకు తగ్గట్లుగా ఆరోగ్యపరమైన శ్రద్ద అవసరం. కొన్ని పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు. అందుకోసం నిపుణులు 20 రకాల పరీక్షలను సూచిస్తున్నారు. మరి రోజుకో పరీక్ష గురించి తెలుసుకోండి.
వైద్య పరీక్ష - 1
ప్రతీ ఆరు నెలలకు ఒక సారి మీ రక్త పోటు ఎంతుందో పరీక్షించుకోవడం ఎంతో ముఖ్యం. మీ రక్తపోటు 120/80 మాత్రమే ఉండాలి. 120 నుంచి 139 మధ్యలో, 80 నుంచి 90 మధ్యలో ఉన్నా అది క్షేమకరం కాదు. వెంటనే వైద్యుడి వద్దకు వెళ్లడం ఉత్తమం. ఇప్పటికే మీకు డయాబెటిస్, కొలెస్టరాల్ ఇతర సమస్యలుంటే వారం వారం బీపీ పరీక్ష తప్పనిసరి.
సాధారణంగా వైద్యుల సూచన ప్రకారం 25 సంవత్సరాలు దాటిన వారందరూ ఆరు నెలలకోసారి తమ రక్తపోటును పరీక్షించుకోవడం చాలా అవసరం. ఒకవేళ బీపీ సాధారణ స్థాయి దాటి ఎక్కువగా ఉంటూ వైద్యుల సలహా తీసుకుంటుంటే మాత్రం వారం వారం చెకప్ తప్పనిసరి.
బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు తల తిరగడం, మెడలు, భుజాలు, వెన్ను నొప్పి రావడం తల వెనుక భాగంలో పోటు లాంటి లక్షణాలు కన్పించవచ్చు. బీపీ తక్కువగా ఉంటే నీరసం, కళ్లు తిరిగి పడిపోవడం కూడా జరుగుతుంది. ఈ లక్షణాలు కన్పించకపోవయినా క్రమం తప్పకుండా బీపీ పరీక్ష చేయించుకుంటేనే మేలు.