: టిఫినీలు తింటే రోగాలు దూరం!
ఉదయాన్నే టిఫిన్ తీసుకోవడం వల్ల పలు రకాలైన వ్యాధుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనలో చాలామంది బరువు తగ్గాలనే ఉద్దేశ్యంతో ఉదయం పూట టిఫిన్ చేయడం మానేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల షుగరు వ్యాధి వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే పరిశోధకులు హెచ్చరించారు. అయితే ఇప్పుడు ఉదయం పూట మనం తీసుకునే అల్పాహారం మనల్ని షుగరు. హైబీపీ, గుండెజబ్బు వంటి పలు వ్యాధులనుండి కూడా దూరంగా ఉంచుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
టెల్ అవైన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో ఉదయం పూట చక్కగా అల్పాహారం తీసుకుంటే షుగరు, హైబీపీ, గుండె జబ్బుల బారిన పడకుండా కాపాడుకోవచ్చని తేలింది. అందునా మనం ఉదయం పూట తీసుకునే టిఫిన్‌లో కేలరీలు ఎక్కువగా ఉండేలా చూసుకుంటే మరింత మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట మనం తీసుకునే అల్పాహారం మన శరీరంలోని జీవ గడియారం (సిర్కాడియన్ రిథమ్) రోజంతా కూడా సజావుగా సాగేలా చూస్తుందని, అందువల్ల శరీరం ఆహారాన్ని గ్రహించే ప్రక్రియపై మనం ఆహారాన్ని తీసుకునే సమయం గణనీయమైన ప్రభావం చూపుతోందని ఈ పరిశోధనలో పాల్గొన్న ప్రొఫెసర్ జుకుబోవిజ్ చెబుతున్నారు.
రాత్రిపూట పెద్ద మొత్తంలో ఆహారం తీసుకునేవారితో పోలిస్తే ఉదయం పూట ఎక్కువగా అల్పాహారం తీసుకున్నవారిలో బరువు, నడుం చుట్టుకొలత మరింత ఎక్కువగా తగ్గుతున్నట్టు జుకుబోవిజ్ గుర్తించారు. అలాగే అల్పాహారంలో ఒక ముక్క చాక్లెట్ కేక్‌ను కూడా కలిపి తింటే ఇన్సులిన్, గ్లూకోజ్, ట్రైగ్లిజరైడ్ల మోతాదులు కూడా గణనీయంగా తగ్గుతున్నట్టు వీరి పరిశోధనలో తేలింది. ఈ ఇన్సులిన్, గ్లూకోజ్ వంటివి షుగరు, హైబీపీ, గుండెజబ్బులను తెచ్చిపెట్టేవే కావడం వల్ల ఉదయం పూట పెద్ద మొత్తంలో అల్పాహారం తీసుకోవడం వల్ల ఈ వ్యాధుల ముప్పును తగ్గించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.