: కేంద్ర మంత్రులూ.. ప్రజలకు ద్రోహం చేయకండి: వీరశివారెడ్డి


కేంద్ర మంత్రులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరశివారెడ్డి విరుచుకుపడ్డారు. ప్రజలకు ద్రోహం చేస్తూ కేంద్ర మంత్రులుగా ఎంతకాలం పదవుల్లో కొనసాగుతారని సూటిగా ప్రశ్నించారు. 'ఆరుసార్లు ఎంపీగా గెలిపించిన ఏలూరు ప్రజల్లోకి ఒకసారి వచ్చి చూడు, అప్పుడన్నా సమైక్యాంధ్ర ఉద్యమం తీరుతెన్నులు తెలుస్తా'యని కావూరి సాంబశివరావుకు సూచించారు. చిరంజీవిని సొంత ఊరివాళ్లే తరిమికొడితే తిరుపతి ప్రజలు అక్కున చేర్చుకున్నారని, ఆ ప్రజల మనోభావాలు తెలుసుకోవాలంటే ఢిల్లీ విడిచి తిరుపతిలో అడుగుపెట్టాలని, అప్పడైనా.. పదవో, ప్రజలో నిర్ణయించుకునే విచక్షణ కలుగుతుందని హితవు పలికారు.

పురందేశ్వరి ఎక్కడ పుట్టిందో, ఎక్కడ పెరిగిందో తెలియకపోయినా వైజాగ్ వాసులు ఆదరించారని, ఆమె ఓసారి విశాఖలో అడుగుపెట్టి చూడాలని సూచించారు. పనబాక లక్ష్మి కేంద్ర మంత్రిగా అనుభవించింది చాలని, ఇకనైనా పదవిని విడిచి ప్రజల్లోకి రావాలని డిమాండ్ చేశారు. పదవులు మరో 6 నెలలు ఉంటాయి. ఆ తరువాత ప్రజలే గెలిపించాలన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని వీరశివారెడ్డి హెచ్చరించారు.

టీడీపీ, వైఎస్సార్సీపీ అధినేతలకు, కేంద్ర మంత్రులకు రాష్ట్ర విభజన సంగతి తెలిసినా తమ స్వార్థ ప్రయోజనాలకు కట్టుబడి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ప్రజా ప్రతినిధులుగా ప్రజావాణిని వినిపించాల్సింది పోయి అధిష్ఠానానికి, స్వప్రయోజనాలకు అమ్ముడు పోయారని ఎద్దేవా చేశారు. తక్షణం రాజీనామాలు చేసి ప్రజల్లోకి రావాలని వీరశివారెడ్డి డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News