: భారత జవాన్ల ఘటనపై దద్దరిల్లిన పార్లమెంటు
జమ్మూకాశ్మీర్ లోని పూంఛ్ సెక్టార్ వద్ద ఐదుగురు భారత జవాన్లు నేలకొరగడంపట్ల పార్లమెంటు దద్దరిల్లింది. రాజ్యసభ ప్రారంభమైన వెంటనే బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ ప్రకటన సరిగా లేదన్నారు. కాల్పుల ఘటనపై విభిన్న ప్రకటనలు వెలువడ్డాయని మండిపడ్డారు. పాక్ సైనికుల దుస్తుల్లో ఉన్నవారు తీవ్రవాదులని సైన్యం చెబుతోందన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై నిర్ణక్ష్యంగా వ్యవహరిస్తోందని అసహనం వ్యక్తం చేశారు. సమయం ముగిసినా వెంకయ్యనాయుడు ఇంకా ప్రసంగం కొనసాగిస్తుండడంపై చైర్మన్ హమీద్ అన్సారీ కూర్చోవాలంటూ వారించారు. అయినా ఆయన వినకపోవడంతో సభను పావుగంట సేపు వాయిదా వేశారు.
అటు లోక్ సభ లో కూడా భారత జవాన్ల కాల్పుల ఘటనపై ప్రతిపక్షనేత సుష్మాస్వరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జవాన్లపై దాడికి సంబంధించి రక్షణ శాఖ విరుద్ధ ప్రకటనలు చేసిందన్నారు. ఈ సమయంలో సభలో గందరగోళం నెలకొనడంతో 12 గంటల వరకు స్పీకర్ మీరాకుమార్ వాయిదా వేశారు.