: దీనివల్లే చర్మం కమిలిపోతోంది!
ఎండలో తిరగడం వల్ల మన చర్మం కమిలిపోతుంటుంది. దీంతో చర్మాన్ని కాపాడుకోవడానికి పలు లేపనాలను ఆశ్రయించాల్సి వస్తుంది. రోజురోజుకూ సూర్యుడి తాపం పెరిగిపోతున్న నేపధ్యంలో ఎండకు చర్మం ఎర్రగా కమిలిపోయి నొప్పి కలుగుతుంది. అయితే మనలో కొందరు మాత్రమే ఇలా ఎండ తీవ్రతకు గురవుతుంటారు. వారిలో మాత్రమే సూర్యరశ్మికి చర్మం కమిలిపోవడం జరుగుతుంటుంది. ఇలా కొందరు మాత్రమే ఎండ తీవ్రతను తట్టుకోలేకపోవడానికి కారణాలను పరిశోధకులు గుర్తించారు. మన చర్మంలోని కొన్ని ప్రత్యేకమైన అణువుల కారణంగానే చర్మం కమిలిపోతున్నట్టుగా పరిశోధకులు చెబుతున్నారు.
డ్యూక్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఎండలో తిరగడం వల్ల చర్మం కమిలిపోయి నొప్పి కలగడానికి కారణాలను గురించి పరిశోధన సాగించారు. వీరి పరిశోధనలో ఎండలో తిరిగినపుడు చర్మం కమిలిపోవడానికి కారణం మన చర్మంలో ఉండే ఒక అణువుగా గుర్తించారు. ఈ అణువును అడ్డుకునే విధంగా కొత్తరకం లేపనాలను రూపొందించడం ద్వారా ఈ సమస్యను చక్కగా పరిష్కరించవచ్చని చెబుతున్నారు. మన చర్మంపైన ఉన్న ఎపిడెర్మిస్ పొరలో టీఆర్‌పీవీ4 అనే అణువు వల్ల చర్మం కమిలిపోతుందని పరిశోధకులు తమ పరిశోధనలో కనుగొన్నారు. నొప్పి ప్రక్రియలో కూడా దీనిపాత్ర ఉన్నట్టు గతంలో పరిశోధనల్లో తేలింది.
అయితే ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల చర్మం కమలడానికి, ఫలితంగా నొప్పి కలగడానికి ఈ అణువుకు ఏదైనా సంబంధం ఉందా? అనే దిశగా శాస్త్రవేత్తలు పరిశోధన సాగించారు. ఈ పరిశోధనలో టీఆర్‌పీవీ4 లేని ఎలుకలను ప్రత్యేకంగా జన్యు పరిజ్ఞానం ద్వారా సృష్టించారు. దాదాపుగా మానవ చర్మాన్ని పోలివుండే వాటి వెనుక పాదాన్ని అతినీలలోహిత కిరణాలకు గురిచేశారు. సాధారణ ఎలుకలతో పోలిస్తే ఈరకం ఎలుకల్లో చాలా తక్కువ చర్మం కమిలినట్టుగా గుర్తించారు. ఈ పరిశోధన చర్మం కమలడంతోబాటు ఇతర రకాలైన నొప్పులను కూడా ఎదుర్కోవడానికి కూడా ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.