: కుక్కను పెంచుకుంటున్నారా... జాగ్రత్త
మీరు కుక్కను పెంచుకుంటున్నారా... అయితే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ కుక్క ఎవరినైనా కరిచిందంటే ఇక మీకు జీవిత ఖైదు ఖాయం. ఎందుకంటే ఇలాంటి నిబంధన బ్రిటన్లో రానుంది. దీంతో కుక్కలను పెంచుకుంటున్న శునకప్రియులు తమ పెంపుడు శునకాల విషయంలో చాలా జాగ్రత్తపడుతున్నారు.
బ్రిటన్లో కొత్తగా ఒక నిబంధన తీసుకువచ్చేందుకు ఆ దేశ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కుక్కలను పెంచుకునేవారు తమ పెంపుడు కుక్కలు ఎవరినైనా కరిచినా, లేదా అవి దాడి చేయడం వల్ల ఎవరైనా మరణించినా సదరు శునక యజమానులకు జీవితఖైదు విధించేలా ఈ నిబంధన రూపుదిద్దుకోనుంది. ఇప్పటివరకూ ఉన్న ఈ నిబంధన ప్రకారమైతే పెంపుడు కుక్క ఎవరినైనా గాయపరిస్తే సదరు కుక్క యజమానికి గరిష్టంగా రెండేళ్ల జైలుశిక్షతోబాటు జరిమానా పడుతుంది. అయితే కుక్కల దాడులు భయంకరమైన స్థాయిలో ఉండడంతో ఈ నిబంధనలో ఈ మేరకు ప్రత్యేక సవరణలు తీసుకువచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కుక్కల దాడులు భయంకరమైన స్థాయిలో ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఈ నిబంధనలో ఇలాంటి సవరణలు అవసరమని జంతు సంక్షేమశాఖ మంత్రి లార్డ్ డి మౌలే చెబుతున్నారు. బ్రిటన్లో ఏటా రెండు లక్షల మందికిపైగా ప్రజలు కుక్కకాటుకు గురవుతున్నారని అంచనా.