: 35 మందికి ప్రాణం పోసిన ఒకే ఒక్కడు
జన్మనిచ్చేది అమ్మ.. జీవితానికి ఊపిరి పోసేది అమ్మ. కానీ, మానవుడిగా తోటి వారికి పునర్జన్మనివ్వగల అద్భుతమైన అవకాశం అవయవదానం కల్పిస్తుంది. దేశంలో ఏటా అవయవ దాతలు లభించక 3,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీలో ఒక తండ్రి బ్రెయిన్ డెడ్ అయిన తన కొడుకు అవయవాలను 35 మందికి దానం చేసి ఇతరులను ఆలోచింపజేశాడు. గుండె, లివర్, మూత్ర పిండాలు, కళ్లు.. ఇలా దానానికి వీలున్న అన్ని అవయవాలనూ సంతోషంగా ఇచ్చేసి 35 మందిలో తన కొడుకును చూసుకోగల భాగ్యం దక్కిందని బాధలోనూ అనంత సంతోషాన్ని పోగేసుకున్నాడు జునేజా.
ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో తన కొడుకు అనుమోల్ బ్రెయిన్ డెడ్ అని చెప్పగానే.. జునేజా దంపతులు వైద్యుల సూచన మేరకు అవయవదానానికి ముందుకు వచ్చారు. 'నా కొడుకు ఎలాగో వెళ్లిపోయాడు.. మిగతా వారికైనా సాయపడ్డాం' అంటూ అనుమోల్ తల్లి చెప్పిన మాట అమూల్యం. అంతేకాదు ఈ దంపతులు కూడా మరణానంతరం అవయవదానం చేయడానికి సమ్మతి వ్యక్తం చేశారు.