: మెదడే లక్ష్యసాధనకు కీలకం
మనలో చాలామందికి ఏవో కొన్ని లక్ష్యాలుంటాయి. అయితే వాటిని చేరుకోవడానికి ఎంతో సాధన, ఓర్పు, నేర్పు అవసరం. అయితే ఇవన్నీ అందరికీ ఉంటాయా... ఏమో చెప్పలేం. కొందరు మాత్రం తాము కోరుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. మరి కొందరు మాత్రమే ఇలా చేరడానికి కారణాలేమైవుంటాయి...? ఇలాంటి వాటికి సంబంధించిన రహస్యాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టేశారు. మన మెదడులో ఉండే ఈ కీలకమైన విషయాన్ని శాస్త్రవేత్తలు పరిశోధన ద్వారా ఛేదించారు.
అమెరికాలోని మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)కి చెందిన శాస్త్రవేత్తలు మన మెదడులో లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ఓర్పు, నేర్పులకు మూలమెక్కడ? అనే విషయంపై పలు పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల ద్వారా మన మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్ డొపమైన్ అనేది మనం కోరుకున్న లక్ష్యాలను సాధించాలన్న ప్రేరణ కలిగిస్తుందని గుర్తించారు. శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఎలుకలపై పరిశోధనలు చేశారు. ఎలుకలకు చాకొలేట్ పాలను వాటికి అందుబాటులో ఉంచి పరిశోధనలు జరిపారు.
చాకొలేట్ పాలను చేరుకున్న కొద్దీ ఎలుకల్లో డొపమైన్ సంకేతవ్యవస్థ బలపడుతోందని వారు గుర్తించారు. అంతేకాదు లక్ష్యం యొక్క పరిమాణం కూడా ఈ సంకేతాలపై ప్రభావం చూపుతోందని ఈ పరిశోధనల్లో తెలిసింది. ఎలుకల్లాగే మనుషులు కూడా క్షీరదాల కుటుంబానికి చెందినవారు కాబట్టి ఈ పరిశోధన ఫలితాలు మానసిక అధ్యయనాలకు ఉపయోగపడతాయని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ ఆన్ గ్రేబీల్ చెబుతున్నారు. ఇలా మెదడులోని డొపమైన్ సంకేత వ్యవస్థ సరిగా పనిచేయని కారణంగా పార్కిన్సన్ వ్యాధిగ్రస్థులు తమ లక్ష్యాలను పూర్తి చేయడానికి ఇబ్బందులు పడుతుంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.