: సినీ పరిశ్రమను హైదరాబాదు నుంచి తరలిస్తే సమస్యలు: తమ్మారెడ్డి భరద్వాజ
రాష్ట్ర విభజన సెగ సినీ పరిశ్రమను కలవరపెడుతోంది. తెలంగాణ ప్రకటనతో సినీ పరిశ్రమను హైదరాబాదు నుంచి తరలిస్తే కొత్త సమస్యలు వస్తాయని ప్రముఖ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు 1990ల కాలం నుంచి హైదరాబాదు సొంతింటిలా ఉందని, సరైన విధాన నిర్ణయాలు అమలు చేసినన్నాళ్లూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. పరిశ్రమను రక్షించాలంటే ప్రభుత్వం కచ్చితమైన విధానాలు అవలంబించాలని తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ అనుకూలంగా ఉంటుందని ప్రకటించాక 'తెలంగాణ సినిమా ఫోర్స్' పేరుతో ప్రత్యేక సినిమా కమిటీ ఏర్పాటు చేయాలని కొంతమంది ఆసక్తి చూపించారని భరద్వాజ చెప్పారు.