: పాకిస్తాన్ కు ఉగ్రముప్పు... దేశంలో హై అలెర్ట్
పాకిస్థాన్ కు ఉగ్రముప్పు పొంచి ఉంది. తాలిబాన్ తీవ్రవాదులు మెరుపుదాడులకు తెగబడి తీరని నష్టం చేకూర్చే అవకాశముందని నిఘావర్గాల సమాచారం. దీంతో ఆ దేశంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. సెక్రటేరియట్, పార్లమెంటు, విమానాశ్రయం, డిప్లోమాటిక్ ఎన్ క్లేవ్, ఫైవ్ స్టార్ హోటళ్లపై తాలిబాన్లు దాడులకు తెగబడనున్నారని సమాచారం ఉంది. దీంతో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధికారులను అప్రమత్తం చేశారు. గత వారం డేరా ఇస్మాయిల్ ఖాన్ జైలు నుంచి తప్పించుకున్న 252 మంది తీవ్రవాదులు ఆ దేశానికి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నారు.
అందులో భాగంగా వీరు ఈ దేశాన్ని భారీగా దెబ్బతీసేందుకు ప్రణాళికలు రచించారని పాక్ ఉన్నతాధికారులు హెచ్చరించారు. దీంతో త్రివిధ దళాలు తీవ్రవాదులను వెదికేందుకు కొండలు గుట్టలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పుడేం ముంచుకొస్తుందోనని ప్రజలు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు.