: తెలంగాణపై కేబినెట్ నోట్ సిద్ధం చేస్తున్నాం : కేంద్రం
తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ విధివిధానాలపై కేబినెట్ నోట్ రూపొందుతోందని రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీనికి సంబంధించి ఆర్ధిక మంత్రి పి.చిదంబరం ప్రకటన చేశారు. ఇదే సమయంలో నోట్ పై బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్ని సక్రమంగా నిర్వహించ లేకపోతుందని విమర్శించారు. సభలో సమాధానం చెప్పలేకే ప్రభుత్వం తెలంగాణపై నోట్ ను సిద్ధం చేస్తున్నట్లు చెప్పిందని మండిపడ్డారు. దాంతో, సభలో నినాదాలు హోరెత్తడంతో డిప్యూటీ చీఫ్ పీజే కురియన్ రాజ్యసభను రేపటికి వాయిదా వేశారు. అటు లోక్ సభలో కూడా టీడీపీ ఎంపీలు, సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు సమైక్యాంధ్రకు అనుగుణంగా నినాదాలు చేశారు. ఉదయం నుంచి మూడుసార్లు వాయిదాపడిన తర్వాత కూడా పరిస్థితి సద్దుమణగకపోవడంతో లోక్ సభ రేపటికి వాయిదాపడింది.