: ప్రముఖ న్యాయవాది పద్మనాభరెడ్డి అంత్యక్రియలు పూర్తి
రాష్ట్రంలో ప్రముఖ క్రిమినల్ లాయర్ గా పేరుగాంచిన సి.పద్మనాభరెడ్డి నిన్న మరణించిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు హైదరాబాదులోని ఈఎస్ఐ శ్మశాన వాటికలో ఈ మధ్యాహ్నం నిర్వహించారు. మావోయిస్టుల కేసులతో పాటు పలు క్రిమినల్ కేసులను వాదించి విజయం సాధించిన చరిత్ర పద్మనాభరెడ్డి స్వంతం. ఆయన గతకొంతకాలంగా కేన్సర్ తో బాధపడతున్నారు. ఇటీవలే చికిత్స కోసం ఆసియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో చేరారు. పరిస్థితి విషమించగా, ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. 1931లో అనంతపురం జిల్లాలో జన్మించిన పద్మనాభరెడ్డి మద్రాస్ లా కాలేజి నుంచి న్యాయశాస్త్ర పట్టా స్వీకరించారు. అనంతరం మద్రాస్ హైకోర్టులో న్యాయవాదిగా కెరీర్ ఆరంభించారు. 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత గుంటూరు, ఆ పిమ్మట హైదరాబాదు హైకోర్టుల్లో న్యాయవాదిగా కొనసాగారు.