: అన్ని డిమాండ్లు నెరవేరిస్తే.. దేశంలో 50 రాష్ట్రాలు
ప్రత్యేక తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం దాదాపుగా అంగీకరించిన నేపథ్యంలో ఇన్నాళ్లు చల్లబడ్డ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు దేశవ్యాప్తంగా మళ్లీ ఊపందుకుంటున్నాయి. వాస్తవానికి దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్లలో కొన్నింటికి భారీ చరిత్ర ఉండగా.. మరికొన్ని మొన్నీమధ్య పుట్టినవి కావడం గమనార్హం. ప్రత్యేక రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర హోంశాఖకు ఎన్నో అభ్యర్థనలు అందాయి. వాటిని పరిశీలిస్తే..
ప్రస్తుతం మనదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ 29వ రాష్ట్రంగా ఏర్పాటు కానుంది. పశ్చిమబెంగాల్లో ప్రత్యేక గూర్ఖాలాండ్ ఉద్యమం కొనసాగుతోంది. అసోంలో బోడోలాండ్ కోసం కూడా పెద్ద ఎత్తున ఆందోళననలు నడుస్తున్నాయి. ఇక్కడే కర్బి అనే మరో ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కూడా ఉంది. ఇక మహారాష్ట్రలో విదర్భను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ దశాబ్దాలుగా ఉంది.
ఉత్తరప్రదేశ్ ను నాలుగు చిన్న రాష్ట్రాలుగా చేయాలని బీఎస్పీ అధినేత మాయావతి డిమాండ్ చేస్తున్నారు. అవధ్ ప్రదేశ్, పూర్వాంచల్, బుందేల్ ఖండ్, పశ్చిమాంచల్ లేదా హరితప్రదేశ్ గా విభజించాలని కోరుతూ మాయవతి ముఖ్యమంత్రిగా ఉండగా కేంద్రానికి ప్రతిపాదన కూడా పంపారు. ఆగ్రా, అలీగఢ్ ప్రాంతాలు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లోని భరత్ పూర్, గ్వాలియర్ జిల్లాలను కలుపుతూ ప్రత్యేకంగా బ్రజ్ ప్రదేశ్ ఏర్పాటు చేయాలంటూ మరొక డిమాండ్ వచ్చింది. అలాగే, ఉత్తప్రదేశ్, బీహార్, చండీగఢ్ లోని పలు ప్రాంతాలతో బోజ్ పూర్ రాష్ట్రం ఏర్పాటు చేయాలన్నది మరొక డిమాండ్.
జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలలో మైథిలీ బాష మాట్లాడే ప్రాంతాలతో మిథిలాంచల్ ను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. గుజరాత్ లో సౌరాష్ట్ర.. అసోం, నాగాలాండ్ లోని ప్రాంతాలతో దిమరాజి లేదా దిమలాండ్ ప్రత్యేక రాష్ట్రం, మణిపూర్ లోని గిరిజన ప్రాంతాలతో కుకీలాండ్ రాష్ట్రాల డిమాండ్లు కూడా కేంద్ర హోం శాఖ ముందుకు వచ్చిపడ్డాయి.
ఇక, తమిళనాడులోని నైరుతి ప్రాంతం, కర్ణాటకలోని ఆగ్నేయ ప్రాంతం, కేరళలోని తూర్పు ప్రాంతాలతో కొంగునాడు రాష్ట్రం, కర్ణాటకలోని కూర్గ్ ను ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పాటు చేయాలనే డిమాండ్లు ఉద్భవించాయి. జార్ఖండ్, ఛత్తీస్ గఢ్, ఒడిశాలోని పలు ప్రాంతాలతో కోసల్.. కర్ణాటక, కేరళ సరిహద్దు ప్రాంతాలతో తులునాడు, కొంకణి మాట్లాడే ప్రాంతాలతో కొంకణ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. వీటిని నెరవేరిస్తే దేశంలో రాష్ట్రాల సంఖ్య 50 మార్కును దాటడం ఖాయం.