: కాంగ్రెస్ ఎంపీల రాజీనామాలు ఓ డ్రామా: టీడీపీ
కాంగ్రెస్ ఎంపీలపై టీడీపీ నేత పయ్యావుల కేశవ్ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర విభజన జరగడానికి కారణం ప్రధానంగా వారేనని ఆరోపించారు. అధిష్ఠానంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే కాంగ్రెస్ ఎంపీల రాజీనామాల డ్రామా అని విమర్శించారు. ప్యాకేజీలు కుదుర్చుకుని ఆ పార్టీ ఎంపీలు నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. అధిష్ఠానం ఎదుట తలూపి ఇక్కడ ఏమీ తెలియనట్టు ప్రజలతో ఉద్యమాలు చేస్తున్నారన్నారు.
ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన పయ్యావుల, ఆయన పోరాటం గల్లీలోనో, మీడియా ముందో కాదని.. ఢిల్లీలో చేయాలని సూచించారు. ఇక మరో ఎంపీ ఉండవల్లి ప్రసంగాలు ఊసరవెల్లి రంగుల్లాంటివని వ్యాఖ్యానించారు. సమస్యలు తెగాల్సింది పార్టీ వేదికలపై కాదని.. పార్లమెంటు, అసెంబ్లీలో పరిష్కారం కావాలని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.
దయచేసి కాంగ్రెస్ ఎంపీలు ప్రజలను మభ్యపెట్టవద్దని కోరారు. ప్రజాందోళనలు పార్లమెంటులో ప్రతిధ్వనించాల్సిన తరుణం ఇదేనని, కాబట్టి నేటినుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు ప్రజల కష్టాలు, ఆందోళనలను తెలపాలని విజ్ఞప్తి చేశారు. లేకుండా ఈ రాష్ట్రం నిజంగానే విచ్ఛిన్నం అవుతుందన్నారు.