: ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తు 'చీపురుకట్ట'
దేశంలో పేరుకుపోతున్న అవినీతి, అన్యాయాలను ఊడ్చిపారేస్తామంటూ ఓ రాజకీయ పార్టీ పెట్టిన అరవింద్ కేజ్రివాల్ తన ఆకాంక్షకు తగిన ఎన్నికల గుర్తును ఎంచుకున్నారు. చెత్తను ఊడ్చేందుకు ఉపయోగించే 'చీపురుకట్ట'ను పార్టీ గుర్తుగా ఈ ఉదయం ఢిల్లీలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఢిల్లీలోని వాల్మీకి కాంప్లెక్స్ లో చీపురు పట్టుకుని పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సముదాయంలో 2000 మంది మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు ఆవాసం కల్పించారు. సుమారు 200 ఫ్లాట్లను వారికి కేటాయించారు. పారిశుద్ధ్య కార్మికులు నివసించే ఈ స్థలం తమకు పవిత్రమైనదే అని, తమ పార్టీ గుర్తును ఇక్కడే ఆవిష్కరించడం గొప్పగా ఉందని కేజ్రివాల్ వ్యాఖ్యానించారు. తమ ప్రస్థానం ఇక్కడి నుంచే ఆరంభిస్తున్నామని, సమాజంలోని కుళ్ళును ఊడ్చిపడేస్తామన్న నమ్మకం తమకుందని స్పష్టం చేశారు.