: శత్రుఘ్న సిన్హా క్రమశిక్షణ తప్పారంటున్న బీజేపీ
క్రమశిక్షణ తప్పారంటూ బాలీవుడ్ నటుడు, బీహార్ రాజకీయవేత్త శతృఘ్నసిన్హాపై బీజేపీ చర్యలు తీసుకుంటోంది. సిన్హా ఇటీవలే బీహార్ సీఎం నితీశ్ కుమార్ ను వేనోళ్ళ కీర్తిస్తూ, ఆయన ప్రధాని అయ్యే సత్తా ఉన్న నేత అని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్ ను బీజేపీ అధినాయకత్వం తీవ్రంగా పరిగణించింది. పాట్నా సాహెబ్ లోక్ సభ నియోజకవర్గ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్న సిన్హా.. తనకు బీజేపీ తాజా కమిటీల్లో ఒక్క దాంట్లోనూ స్థానం కల్పించకపోవడం పట్ల నరేంద్ర మోడీపై గుర్రుగా ఉన్నారు. దీంతో, మోడీ వ్యతిరేక ప్రచారంతో బీజేపీ అగ్రనేతల ఆగ్రహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ ఉపాధ్యక్షుడు సీపీ ఠాకూర్ మాట్లాడుతూ, శతృఘ్నసిన్హా వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చని, ఎవరూ ఆపరని స్పష్టం చేశారు.