: సీమాంధ్రలో మిన్నంటిన నిరసనలు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడాన్ని సీమాంధ్ర నేతలు, ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగు రాష్ట్రాన్ని విడదీయాలన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయం దుర్మార్గమని సమైక్యాంధ్ర జేఏసీ నేతలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజు సీమాంధ్ర అంతటా బంద్ నిర్వహిస్తున్నారు. విద్యార్థులు, నేతలు వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలను అడ్డుకుంటున్నారు.
తిరుపతిలో నిరసనకారులు ఆర్టీసీ బస్సులకు గాలి తీసేశారు. తిరుపతి పట్టణమంతటా బంద్ పెద్ద ఎత్తున కొనసాగుతోంది. కడపలో సమైక్యాంధ్ర నేతలు తెల్లవారుజామునుంచే బంద్ లో పాల్గొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడివక్కడే బస్సులు నిలిచిపోయాయి. ఆటోలు కూడా లేకపోవడంతో ప్రజా రవాణా స్తంభించిపోయింది. ప్రకాశం జిల్లాలో యువజన సంఘాల నాయకులు బస్ డిపో వద్దకు చేరుకుని బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. షాపులను కూడా మూసివేయించారు. గుంటూరు జిల్లా బాపట్లలో జాతీయ రహదారిపై విద్యార్థులు బైఠాయించి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీమాంధ్ర మంత్రులంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాకినాడలో విద్యా, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. ఇతర జిల్లాలలో కూడా బంద్ కొనసాగుతోంది.