: గ్రహశకలానికి పేరుపెట్టిన బుల్లిశాస్త్రవేత్తలు
ఓ కొత్త గ్రహశకలాన్ని కనుగొనడమూ , దానికి నామకరణం చేయడమూ ఇలాంటి కసరత్తులు పెద్దపెద్ద శాస్త్రవేత్తలు మాత్రమే చేయగలిగే విషయాలు అని అనుకుంటే మనం పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. ఢిల్లీలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుకుంటున్న ఇద్దరు చిన్నారులు కూడా ఈ పనిని సాకారం చేసేశారు. వారిద్దరూ ఇప్పుడు ఓ కొత్త గ్రహశకలం ఆవిష్కర్తలు. వారి పేర్లు గౌరవ్ పాటి, శౌర్య చాంబియాల్ కాగా.. తాము కనిపెట్టిన కొత్త గ్రహానికి మాత్రం.. '2013 ఎల్‌ఎల్ 28' అంటూ వారే నామకరణం చేసేశారు.
విషయం ఏంటంటే.. గత మే నెలలో ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ సెర్చ్ కొలాబరేషన్స్ (ఐఏఎస్‌సీ) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న వీరు.. 60 అంతరిక్ష వస్తువులను గుర్తించారు. ఆ వివరాలను నాసాకు పంపించారు. ఆ 60లో ఓ గ్రహశకలం కూడా ఉండడంతో వీరి పేరు ఖ్యాతికెక్కింది. ఇప్పుడు వీరు తమ భవిష్యత్తును సైన్స్ ఫిక్షన్, నాసా రంగాలతో ముడిపెట్టుకుని కలలు కంటున్నారు.